సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమ స్తే తెలంగాణ): ఆర్టీసీతో అడ్వర్టైజ్మెంట్కు సంబంధించిన ఒప్పందాలు చేసుకొని.. రూ.21 కోట్లు మోసం చేసిన ‘గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ నిర్వాహకుడిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ కథనం ప్రకారం.. ఖమ్మంకు చెందిన వద్దను సునీల్ చింతల్లో ఉంటున్నాడు. గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని తన భార్య మృదాలతో కలిసి నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్టీసీ రీజియన్‌కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్టును నాలుగేండ్ల కిందట తీసుకున్నాడు. ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీకి సంబంధించిన ఇతర ప్రాపర్టీలలో ప్రకటనలు వేసి, ఆయా కస్టమర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు.
అయితే, ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడంలేదు. దీంతో గత ఏడాది ఆర్టీసీ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీఎస్ టీమ్ – 5 ఏసీపీ బి.బాబూరావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. సునీల్, అతడి భార్య కలిసి పక్కా ప్లాన్‌తో ఆర్టీసీకి రూ. 21,72,27,395 మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ మేరకు సునీల్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.