CCS Cybercrime | సిటీబ్యూరో: ఐదు రాష్ర్టాల్లో గాలించి.. 30 కేసుల్లో 23 మంది సైబర్నేరగాళ్లను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్‌క్రైమ్స్ డీసీపీ దార కవిత వెల్లడించారు. ఈ నిందితులకు దేశ వ్యాప్తంగా 359 కేసులతో సంబంధముందని వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓ మహిళ కూడా ఉందని, ఆమె తన ఎన్టీఓ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాను సైబర్‌నేరగాళ్లకు ఇచ్చి వారితో చేతులు కలిపిందని విచారణలో వెల్లడయ్యిందని వివరించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కవిత ఆయా సైబర్‌నేరాల్లో ప్రధాన కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
యూపీకి చెందిన కమలేశ్కుమారి వ్యాపారం నిర్వహిస్తూ, స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నది. ఆమె అక్కడ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు పెట్టడంతో తాను సొంతంగా ఆర్థిక కష్టాల్లోకి వెళ్లింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు సైబర్‌నేరగాళ్లతో పరిచయం ఉన్నవాళ్లు ఆమె ఎన్జీఓ బ్యాంకు ఖాతాను తమకు అప్పగించాలని కోరారు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాను సైబర్‌నేరగాళ్లకు అప్పగించింది. ఆ ఎన్జీఓ ఖాతాలో బాధితులు డిపాజిట్ చేసే సొమ్ములో తగిన కమిషన్ ఆమెకు అందుతున్నది. ఇలా హైదరాబాద్‌కు చెందిన బాధితుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో రూ. 1.90 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ సతీశ్‌రెడ్డి బృందం బ్యాంకు ఖాతాలను ఆరా తీయడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థ అకౌంట్లోకి బాధితుడి సొమ్ము డిపాజిట్ అయి, ఆ ఖాతా నుంచి ఇతర ఖాతాలకు బదిలీ కావడం, కొంత సొమ్ము విత్ డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక బృందం యూపీ వెళ్లి కమలేశ్కుమారితో పాటు మరికొంత మందిని అరెస్టు చేశారు. ఆమెను అరెస్టు చేయవద్దంటూ యూపీలో 10 మంది లాయర్ల బృందం కోర్టులో వాదనలు వినిపించింది. అయితే పోలీసులు ఆమె బ్యాంకు ఖాతాలోకి బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ము, అక్కడి నుంచి ఇతర ఖాతాలకు వెళ్లిన వైనాన్ని కోర్టు దృష్టికి తీసికెళ్లడంతో అక్కడి కోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.
‘మీ పేరుతో వెళ్తున్న డీహెచ్ఎల్ కొరియర్లో డ్రగ్స్ ఇతర నిషేధిత పదార్థాలు ఉన్నాయి.. మేం ముంబై సైబర్ సెల్ నుంచి మాట్లాడుతున్నాం’ అంటూ నేరగాళ్లు బాధితుడిని డిజిటల్ అరెస్టు చేసి, రూ. 34 లక్షలు లూటీ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ బృందంలోని ఎస్సైలు వెంకటాద్రి, షేక్ అజీజ్‌లతో కూడిన బృందం కేసు దర్యాప్తు చేపట్టింది.
గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన బరై సంజీవ్ కుమార్ బాబుబాయ్, కాలి రోహిత్‌కుమార్ ఛట్రిష్న్ కల్మిలు ఇతర దేశాల్లో ఉండే ప్రధాన నేరగాళ్లతో చేతులు కలిపారు. ఈ ముఠాలోని నేరగాళ్లు కొరియర్, టెలికాం, ట్రై, సీబీఐ, సైబర్ పోలీస్, ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ అని చెప్పుకుంటారు. ఫేక్ కోర్టు ఆర్డర్ తయారు చేసి బాధితులకు వీడియో కాల్ చేస్తూ, ఎవరికీ చెప్పొద్దని ఇది దేశానికి సంబంధించిన సీక్రెట్ అని భయపెట్టించి డిజిటల్ అరెస్టు చేసి అందిన కాడికి దోచేస్తారు.
ట్రేడింగ్‌లో అధిక లాభాలు సంపాదించవచ్చంటూ నగరానికి చెందిన బాధితుడి వద్ద నుంచి రూ.2.95 కోట్లు కొట్టేసిన సైబర్‌నేరాల ముఠాను ఇన్స్పెక్టర్ సీతారాములు బృందం అరెస్టు చేసింది. దుబాయ్‌లో ఉన్న రితేశ్ సోని బెంగళూర్‌కు చెందిన సమీర్ హందేకర్, దీపక్ సంపత్ సహకారంతో బ్యాంకు ఖాతాలను సేకరిస్తూ బాధితుల నుంచి మోసం చేసిన సొమ్మును ఆయా ఖాతాలో డిపాజిట్ చేయిస్తున్నట్లు వెల్లడయ్యింది. దీంతో ఈ కేసులో బెంగళూర్‌కు చెందిన హందేకర్, దీపక్ సంపత్‌ను అరెస్ట్ చేశారు.
అయితే ఈ ఇద్దరు నిందితులు కోదాడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోని యువతను వలలో వేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. ఈ గ్రామాల్లోని యువతి యువకులు 5 శాతం కమీషన్‌తో సైబర్‌నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. అందులో డిపాజిట్ అయిన సొమ్మును డాలర్లలోకి మార్చి తిరిగి పంపిస్తున్నట్లు బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ యువతి, యువకుడికి నోటీసులు ఇచ్చినట్లు వివరించారు.