సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): విజ్ఞాన రంగ పరిశోధనలపై యువతకు అవగాహన కల్పించేలా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ ఏర్పాటు చేసిన వన్ వీక్ వన్ ల్యాబ్ కార్యక్రమం ప్రారంభమైంది. తార్నాకలోని సీసీఎంబీలో ఆగస్టు 5వరకు సందర్శించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో సీసీఎంబీ పరిశోధనలు, మాలిక్యూలార్, డీఎన్ఏ పరిశోధన పరికరాలు, వైల్డ్ లైఫ్ డీఎన్ఏ, సీసీఎంబీలోని స్టార్టప్‌కు చెందిన ఉత్పత్తులను వీక్షించేలా ఏర్పాటు చేసినట్లుగా సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, డీఎన్ఏ అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జీని అందించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ అనుబంధ సంస్థలను సందర్శించేలా వన్ వీక్ వన్ ల్యాబ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 5 వరకు సందర్శించే వీలు ఉండగా.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పాఠశాల విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు సందర్శిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక సెషన్లు, సైంటిస్టులతో ఇంటరాక్షన్ వంటి కార్యక్రమాలను కల్పించారు. సైన్స్ అండ్ టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు, నేటి ఆధునిక యుగంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఈ సందర్శన ఎంతగానో సాయపడుతుందన్నారు.
జీవ సంరక్షణలో సీసీఎంబీ ముఖ్య భూమిక
అంతరించిపోతున్న మొక్క, జంతు జాతులతోపాటు, సీకిల్ సెల్ వంటి జన్యు సంబంధిత వ్యాధులపై పరిశోధనలు చేయడంలో సీసీఎంబీ ముఖ్య భూమిక పోశిస్తుంది. పాఠశాల, కాలేజీ విద్యార్థులను యువ పరిశోధకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వన్ వీక్ వన్ ల్యాబ్ నిర్వహిస్తున్నాం. సీసీఎంబీ అనుబంధంగా నగరంలో లాకోన్స్, ఏఐసీఐ హబ్ క్యాంపస్‌లు ఉన్నాయి. సీసీఎంబీలో ఇప్పటివరకు 100కు పైగా నూతన ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు ఎంతోమందికి ఉపాధి అవకాశాలను అందించే వేదికగా సీసీఎంబీ వ్యవహరిస్తున్నది.
– డా. వినయ్ నందికూరి, సీసీఎంబీ డైరెక్టర్
విజ్ఞానాన్ని అందించే వేదిక
విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక రంగంపై ఆసక్తిని పెంచడంలో, విజ్ఞానాన్ని పెంపొందించే వేదికగా వన్ వీక్ వన్ ల్యాబ్‌కు గుర్తింపు ఉంది. బైంసా నుంచి 8, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులను తీసుకొని సందర్శనకు వచ్చాం. విజిటింగ్‌లో భాగంగా నిత్యం పాఠ్యాంశాలల్లో చదివించే ఎన్నో విషయాలను విద్యార్థులు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంటికి కనిపించని డీఎన్ఏ నిర్మాణ క్రమం, సూక్ష్మ జీవులు, వైరస్ రూపాంతరాలు వైజ్ఞానిక అంశాలపై ప్రాక్టీకల్ నాలెడ్జిని పొందవచ్చు.
– ప్రతిమ, టీచర్
సైన్స్ ఫెయిర్ కంటే గొప్పగా ఉంది
స్కూళ్లలో నిర్వహించే సైన్స్ ఫెయిర్ లాగే ఉన్నా… ఇక్కడ చాలా విషయాలను కళ్లతో చూసే అవకాశం వచ్చింది. డీఎన్ఏ గురించి సిలబస్‌లో చదువుకొని, ఊహా జనిత చిత్రాలను మాత్రమే చూశా. కానీ ఇక్కడ నిల్వ చేసిన అంతరించిపోతున్న జన్యు రూపాన్ని చూడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. పంటలకు సోకే ఫంగస్, బ్యాక్టీరియా తెగుళ్లు, వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి చెప్పారు.
– సాంచీ, విద్యార్థిని
డీఎన్ఏతో భూమిని మూడుసార్లు చుట్టేయవచ్చు
డీఎన్ఏ నిర్మాణ క్రమాన్ని ఇక్కడ వివరించారు. డీఎన్ఏతో భూమిని మూడు సార్లు చుట్టేంత పొడవైన నిర్మాణమని తెలిసి ఆశ్చర్యపోయాను. మొక్కలకు సోకే తెగుళ్లు, మెడికల్ డివైజ్‌లూ, కాళ్లు, చేతులు పడిపోతే ఫిజియోథెరపీ చేసే డివైజ్ గురించి తెలుసుకున్నాను. డీఎన్ఏ సేకరించి డీర్ మౌస్‌లను సంరక్షించిన తీరు గురించి వివరించారు. అదేవిధంగా డెవలప్మెంటల్ బయాలజీ, నిర్మాణ జీవశాస్త్రం, పంటల అభివృద్ధి వంటి విషయాల గురించి ప్రాక్టీకల్ చేసినట్లుగా వివరించారు.
– త్రిశూల్, 9వ తరగతి విద్యార్థి