హనుమకొండ, నవంబరు 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జనగామ రూరల్: రెండేండ్ల క్రితం బ్రిడ్జి కూలిపోగా, ప్రత్యామ్నాయ రోడ్డు ఇటీవలే తెగిపోయింది. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కే తరలించారు. ఊరికి రోడ్డేయండి మహాప్రభో అని వేడుకున్నందుకే అక్రమ కేసులు బనాయించడంపై ఆ ఊరి ప్రజల నుంచి సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. జిల్లా కేంద్రమైన జనగామ-హుస్నాబాద్ రోడ్డుపై గానుగపహాడ్ క్రాస్ వద్ద బ్రిడ్జి, జనగామ నుంచి చీటకోడూర్ రోడ్డుపై మరో బ్రిడ్జి నిర్మించాలని జనగామ మండలం చీటకోడూరు, గానుగుపహాడ్ గ్రామాలతోపాటు మరో 20 గ్రామాల ప్రజలు కోరుతూ వస్తున్నారు. రెండేండ్ల క్రితం వరదలు రావడంతో చీటకోడూరు బ్రిడ్జి కొద్దిగా కూలింది. ఇటీవల చీటకోడూర్ రిజర్వాయర్ నీటిని వదలడంతో ప్రత్యామ్నాయంగా ఉన్న రహదారి తెగిపోయింది. గత రెండేండ్లుగా ఆయా గ్రామాల ప్రజలు వినతిపత్రాలు, నిరసనలు తెలిపినా అధికారులు పట్టించుకోలేదు. ఏకంగా జనగామ కలెక్టరేట్ ఎదుట దీక్షలే చేశారు. అయినా ఆ ఊళ్లపై కనికరం కలగలేదు. బ్రిడ్జి నిర్మించాలని, తీమ ఇబ్బందులను తొలగించాలని చీటకోడూరు గ్రామస్థులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆవేదనతో గాడిదపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఫొటో పెట్టి నిరసన వ్యక్తంచేశారు.
అధికార పార్టీ నాయకుల జోక్యం!
బ్రిడ్జి నిర్మించాలని కోరిన గ్రామస్థుల అంశంపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జోక్యం చేసుకున్నారు. అర్అండ్ అధికారి రామగిరి స్వరూపరాణితో నిరసన తెలిపిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయించారు. రోడ్డు కావాలని అడిగిన చీటకోడూర్కు చెందిన యాసారపు కరుణాకర్, కర్ల ఎలేందర్‌రెడ్డి చౌడారం, బాల్నే ఉమాపతి, రాగుల రఘు, మారబోయిన రాజులను అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రోడ్డు అడిగితే ఎలా అరెస్టు చేస్తారంటూ గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌లో నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్అండ్బీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చౌడారం గ్రామానికి చెందిన సలేంద్ర కొమురయ్య అర్అండ్బీ అధికారి అశోక్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు. రోడ్డు కోసం నిరసన తెలిపిన ఐదుగురిని పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించింది. రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న గానుగుపహాడ్ బ్రిడ్జి ని ర్మాణం త్వరగా పూర్తిచేయాలని, చీటకోడూ రు వాగుపై తెగిపోయిన బ్రిడ్జి నిర్మాణం వెం టనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరిన వారిని అర్ధరాత్రి అరెస్టు చేయడమేమిటని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేసి గానుగుపహాడ్, చీటకోడూరు బ్రిడ్జిలను త్వరలో పూర్తిచేయాలని కోరారు.