అసలే కరెంట్ పని.. తేడా వస్తే ప్రాణాలు మటాషే.. పక్కాప్రణాళికతో పనులు పకడ్బందీగా చేస్తేనే జనం ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలి. జూబ్లీహిల్స్‌లో తాము ఏదో చేస్తున్నామని ఓటర్లను మభ్యపెట్టాలి. ఇందుకోసం అక్కడ ఉన్న సమస్యల్లో ప్రధానంగా బస్తీ ప్రాంతాల ప్రజలకు అవసరమేంటో కనుక్కోండి.. అర్జెంట్‌గా ఏం చేయాలో చెప్పండి… అది జరిగినా జరగకపోయినా.. జరిగినట్లు ఉంటే చాలు. మనవైపే జనం వస్తారు. ఇది కాంగ్రెస్ పెద్దల వ్యూహం. దీనికోసం కార్యాచరణ రూపొందించారు. బస్తీ ప్రాంతంలో ఉన్న ప్రధానమైన హైటెన్షన్ వైర్ల సమస్యను తీసుకుని అండర్ గ్రౌండ్ కేబుల్ (యూజీ) వేస్తామని స్థానిక నేతలతో చెప్పి ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సిటీబ్యూరో, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : అసలే కరెంట్ పని.. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు మటాషే. అందుకే పక్కాప్రణాళికతో ఎక్కడ పనులు చేపట్టినా పకడ్బందీగా చేస్తేనే జనం ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలి. జూబ్లీహిల్స్‌లో తాము ఏదో చేస్తున్నామని ఓటర్లను మభ్యపెట్టాలి. ఇందుకోసం అక్కడ ఉన్న సమస్యల్లో ప్రధానంగా బస్తీ ప్రాంతాల ప్రజలకు అవసరమేంటో కనుక్కోండి.. అర్జెంట్‌గా ఏం చేయాలో చెప్పండి… అది జరిగినా జరగకపోయినా.. జరిగినట్లు ఉంటే చాలు. మనవైపే వస్తారు. ఇది కాంగ్రెస్ పెద్దల వ్యూహం. దీనికోసం కార్యాచరణ రూపొందించారు.
బస్తీ ప్రాంతంలో ఉన్న ప్రధానమైన హైటెన్షన్ వైర్ల సమస్యను తీసుకుని అండర్ గ్రౌండ్ కేబుల్ (యూజీ) వేస్తామని స్థానిక నేతలతో చెప్పి ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ పనులు చేపట్టాలంటే చాలా పకడ్బందీగా ఎక్కడా ఎవరికీ నష్టం జరగకుండా ప్రణాళికతో చేయాలని విద్యుత్ అధికారులే చెబుతున్నారు. అయితే తమపై ఉన్న ఒత్తిడితో ఏం చేయాలో తెలియక హడావిడిగా పనులకు సంబంధించిన వ్యవహారమంతా చేయాల్సి వస్తున్నదని ఈ విషయంలో తామేం చేయలేకపోతున్నామని వారు ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు. ఇంతకూ అసలు ఈ పనులు ఎక్కడ జరుగుతున్నాయి. దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటో తెలుసుకుందాం..
ఓట్లకోసం కొత్త కేబుల్ నాటకం&
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. ఈ ప్రాంతంలో ఉప ఎన్నికకు ముందే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేరిట ప్రకటించిన పనులే మొదలుకాకపోగా కొత్తగా బస్తీల్లో కరెంట్ సమస్యలను తీరుస్తామంటూ మరో కొత్తనాటకానికి అధికార పార్టీ తెరదీసింది. బస్తీ ప్రజల అమాయకత్వాన్ని, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నది. ఇందులో భాగంగా వారిని నమ్మించడానికి ఫైల్‌ను కదిలించింది. రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ డివిజన్ల పరిధిలో ఇళ్ల మీది నుంచి పోతున్న హైటెన్షన్ వైర్లను తొలగించాలంటూ బస్తీవాసులు కొన్నిరోజులుగా అడుగుతున్నారు.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాగానే బస్తీలో కొందరు పెద్దలు ఈ సమస్యను కాంగ్రెస్ పెద్దల వద్దకు తీసుకుపోయారు. బస్తీ ప్రాంతాలు కావడంతో ఆ ఏరియాల్లో అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాలంటే బస్తీల్లోని ప్రజలకు ఇబ్బందులు కాకుండా పక్కా ప్రణాళికతో పనులు చేపట్టాలని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ నుంచి సహకారం చాలా అవసరమని అధికారులు చెప్పారు. ఇదంతా పట్టించుకోకుండా పనులు చేయాలంటూ సీఎం చెప్పడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పనులు చేపట్టాలంటూ ఎస్సీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీని ఆదేశించినట్లు తెలిసింది.
స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడ పనులు ఎలా చేయాలో చూసి వచ్చి ఇంత తొందరగా చేయడమంటే చాలా కష్టమని, ఇది జనావాసాల్లో ఉన్నది కాబట్టి అవసరమైతే ఓవర్‌హెడ్ లైన్ మరోవైపు నుంచి తీసుకుందామని సలహా ఇచ్చారు, కానీ అధికారుల మాట వినే పరిస్థితిలో కాంగ్రెస్ పెద్దలు లేకపోవడంతో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యామని ఒక సీనియర్ అధికారి తెలిపారు. వెంటవెంటనే పనులు ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యనేతలు ఇద్దరూ హడావిడిగా విద్యుత్ అధికారులకు మౌఖిక ఆదేశాలివ్వడంతో దీంతో తమకెందుకొచ్చిన గొడవ అంటూ అధికారులు అక్కడికి వెళ్లి ప్రాథమికంగా రూ.1.80 కోట్ల పనులకు సంబంధించి అంచనా వేశారు. ఈ మేరకు ఎస్టిమేషన్లు, టెండర్ల ప్రక్రియకు కావలసిన వ్యవహారమంతా గప్‌చుప్‌గా చేస్తున్నట్లు సమాచారం. రూ.1.80 కోట్లతో అంచనాలు వేయగా వాటిని మూడురకాల పనులుగా విభజించి సీఎండి అప్రూవల్ కోసం పంపించారని తెలిసింది.
నామినేషన్ పద్ధతిలో టెండర్లు !
నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ వర్క్‌ను నామినేషన్ పద్ధతిలో ఇస్తున్నట్లు డిస్కంలో ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ పనులు రూ.80 లక్షలు, రూ.50 లక్షలు, రూ.50 లక్షలు చొప్పున విభజించి మూడింటిని ఒక్క కాంట్రాక్టర్‌కే నామినేషన్ పద్ధతిలో ఇస్తున్నట్లు సమాచారం. అయితే అసలు నామినేషన్లో ఇచ్చేందుకు మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనుమతి కావలసి ఉండగా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ వేసిన అనుభవం లేని పాలమూరు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు ఈ పనులు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు డిస్కంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కొత్త పనులు చేసి ఓటర్లను మభ్యపెట్టడం ఒకటైతే.. ఇంత హడావిడిగా బస్తీల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడం వల్ల పనుల్లో నాణ్యత కరువై , ఆదరాబాదరగా పనులు చేస్తే కేబుల్ బయటకు వచ్చి జనం ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అధికారులు చెప్పుకుంటున్నారు.
ఈ విషయంలో తామేం చేయలేకపోతున్నామని, అధికారపార్టీ ఒత్తిళ్లతో ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారి ఏది అడిగితే అది ఇస్తున్నామని, అయితే క్షేత్రస్థాయిలో ఈ పని చేయాలంటే సుమారుగా ఆరునెలల సమయం పడుతుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఇప్పటికే టెండర్లకు సంబంధించిన ఫైల్ సీఎండీ వద్దకు చేరిందని, దీనిపై రేపోమాపో ఆయన నిర్ణయం తీసుకునే అవకాశమున్నదనే మాట ఎలక్ట్రిసిటీ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నది. మరోవైపు ఈ వ్యవహారంలో కూడా తమ పర్సంటేజ్ కోసం ముఖ్యనేత తన సహజవైఖరి కనబరచగా ఓ కాంట్రాక్టర్ ఒప్పుకోకపోవడంతో మరొకరు ఈ పనిచేస్తానంటూ తనకు ఇటువంటి ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం లేకున్నా ఉన్నతాధికారులతో తనకున్న సన్నిహిత సంబంధాలతో ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. మరి ఎన్నిక సమయంలో ఇంత ఆదరాబాదరగా పనులు మొదలుపెట్టి ఆ తర్వాత మధ్యలోనే వదిలేసి పోతే కాలనీవాసులు మరిన్ని ఇబ్బందులకు గురవుతారని, ఈ విషయంలో ఉప ఎన్నిక తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటే బాగుండునని అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.