జమ్మికుంట, నవంబర్ 4: ప్రిన్సిపాల్ చితక బాదడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బెస్ట్ అవలెబుల్ స్కూల్ (బాస్)లో చోటుచేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. జమ్మికుంటలోని ఎస్వీ పాఠశాల (బెస్ట్ అవలెబుల్ స్కూల్)లో వీణవంక మండల కేంద్రానికి చెందిన బండి రజిత-తిరుపతి దంపతుల చిన్న కుమారుడు రామ్చరణ్కుమార్, కోమల-శంకర్ దంపతుల చిన్న కొడుకు చరణ్‌కుమార్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కొద్దిరోజులుగా వీరు చెడు వ్యసనాలకు బానిసయ్యారని, వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చినా విద్యార్థుల్లో మార్పు రావడం లేదని.. టీసీ ఇచ్చి పంపించేస్తామని ఇటీవల హెచ్చరించినట్టు పాఠశాల యాజమాన్యం పేర్కొన్నది. ఇదిలావుండగా, సోమవారం మధ్యాహ్నం వార్డెన్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రిన్సిపాల్ తోటి విద్యార్థుల ముందే రామ్‌చరణ్, చరణ్‌కుమార్, వర్షిత్‌ను చితకబాదాడు. గదిలో బంధించి సాయంత్రం వదిలారు.
రాత్రి 7 గంటల తర్వాత వార్డెన్ కంటపడకుండా ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నుంచి బయటపడ్డారు. ఫర్టిలైజర్ షాపులో రూ.300 పెట్టి అత్యంత విషపూరితమైన ‘పే అవుట్’ అనే గడ్డి మందు కొన్నారు. ఇందులో వర్షిత్ ఇంటికి వెళ్లిపోగా, రామ్‌చరణ్, చరణ్‌కుమార్ ఇద్దరూ హాస్టల్‌కు వచ్చారు. రాత్రి 11 గంటల తర్వాత గడ్డి మందు తాగారు. చనిపోతున్నామనే భయంతో రామ్ చరణ్.. అక్కడే టెన్త్ చదువుతున్న తన అన్న దేవేందర్‌కు మందు తాగినట్టు చెప్పాడు. సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్ వెంటనే జమ్మికుంటలోని ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. మంగళవారం ఉదయం బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పిల్లల పరిస్థితి చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్వీ నాయకుడు తిరుపతి, ఏబీవీపీ నాయకులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ జడ్జి పద్మ సాయిశ్రీ, ఏసీపీ మాధవి వేర్వేరుగా వచ్చి పాఠశాలను పరిశీలించారు. జమ్మికుంటలోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ మల్లేశం, వార్డెన్ రజితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు.