హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఇటీవల మంత్రిగా ప్రమా ణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రెండు శాఖలు కేటాయించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గర ఉన్న ప్రభుత్వరంగ సంస్థలతోపాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న మైనారిటీ శాఖను అజారుద్దీన్‌కు కేటాయించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 31న రాజ్‌భవన్‌లో అజారుద్దీన్‌తో మంత్రిగా ప్రమా ణం చేయించిన విషయం తెలిసిందే. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజుల తర్వాత అజారుద్దీన్‌కు కేటాయించిన శాఖల పట్ల మైనారిటీ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
ప్రమాణ స్వీకారానికి ముందు అజారుద్దీన్‌కు హోం, క్రీడల శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరగగా, ఇప్పుడు అంతగా ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించారని ఆ వర్గాల ప్ర జలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనారిటీ ఓట్లను పొందేందుకు మాత్రమే అజార్‌కి మంత్రి పదవి ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు, హైదరాబాద్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే, హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి అజార్‌కి కీలకమైన శాఖలు కేటాయించేవారని పేర్కొంటున్నారు. అదేవిధంగా మైనారిటీ శాఖను అడ్లూరి లక్ష్మణ్ నుంచి తప్పించి అజార్‌కి అప్పగించడం పట్ల ఆ సామాజిక వర్గం నుంచి కూడా విమర్శలొస్తున్నాయి.