నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, నవంబర్ 4 : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ఆయా జిల్లాల్లోని మంత్రుల ఇండ్లను ముట్టడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలువురు విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు ఖమ్మంలో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్, నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణాల్లో ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని, వాకిటి శ్రీహరి ఇంటిని ఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించారు.
పొన్నం రాజీనామా చేయాలి..
కరీంనగర్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం చేయలేని మంత్రి ఉన్నా.. లేకున్నా నష్టమేమీ లేదని అన్నారు. పొన్నం ప్రభాకర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటాలతో ముందుకు కొనసాగుతామని తేల్చిచెప్పారు. కాగా, మంత్రి ఇంటిని ముట్టడించిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉన్నత విద్యామండలి ముట్టడి ;ఫీజు బకాయిలు చెల్లించాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు మాసబ్‌ట్యాంక్‌లోని మండలి కార్యాలయం గేటు ముందు బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ని నాదాలు చేశారు. మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఈ ముట్టడిలో పాల్గొని వి ద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు, కోతలు సరికాదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్ల జీతాల్లో కోతలు విధించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. తక్షణమే ఫీజు రీ యింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నందగోపాల్, ఉదయ్, శివమ్మ తదితరులు పాల్గొన్నారు.