Gadwal Vijayalakshmi | ఖైరతాబాద్, ఏప్రిల్ 7 : మేయర్ శంకుస్థాపన చేసినా.. రెండు నెలలుగా ఆ బస్తీకి రోడ్డు దిక్కులేదు. బంజారాహిల్స్ డివిజన్లోని ప్రేమ్‌నగర్‌లో గతుకుల రోడ్డుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేండ్ల కిందట ఓ పైపులైన్ కోసం రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వి వదిలేశారు. దీంతో నాటి నుంచి నేటి వరకు సరైన రోడ్డు లేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండగా, వర్షాకాలంలో బురదగుంటలుగా మారిపోతున్నది. డివిజన్‌కు కార్పొరేటర్ అయిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఎన్ని సార్లు విన్నవించినా.. పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
మేయర్ పదవి కాలం ముగియడానికి మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మేయర్ హడావుడిగా రూ. 22.30 లక్షల అంచనా వ్యయంతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కానీ.. నేటి వరకు పనులు చేపట్టకపోవడంతో మేయర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని 150 డివిజన్లకు మేయర్ అయి ఉండి తన సొంత డివిజన్‌లోనే రోడ్డు వేయించలేకపోతున్నారని మండిపడుతున్నారు. కనీసం ఎన్నికల స్టంట్గానైనా రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రేమ్‌నగర్ బస్తీవాసులు వేడుకుంటున్నారు.