శామీర్‌పేట, అక్టోబర్ 8 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాటలు చెప్పడం తప్పితే.. చేసేదేమి లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏం చేస్తున్నదో ప్రజలు గమనించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో తొమ్మిదేండ్లలో రాష్ట్రం అనూహ్య ప్రగతి సాధించిందని తెలిపారు. ఆదివారం ఆయన మూడుచింతలపల్లి మండలం కేశ్వాపూర్, ఉద్దెమర్రి గ్రామాల్లో పల్లె దవాఖానలను, కేశ్వాపూర్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. తూంకుంట మున్సిపాలిటీ 4వ వార్డులో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. 3వ వార్డులో సొంత నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం అంతాయపల్లిలో ఎల్లాపి ఎల్లపు ఆత్మగౌరవ గౌరవ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అడగకుండానే ప్రజల అవసరాలు తెలుసుకొని, అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేశారన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెలు, పట్టణాలు నేడు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. మెరుగైన పారిశ్రామిక విధానం, అత్యంత భద్రతా ప్రమాణాలను అమలు చేయడంతో ప్రపంచ శ్రేణి సంస్థలు భారీగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తున్నదని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా పని చేశాయా..?
బీజేపీ, కాంగ్రెస్ మాటలు చెప్పడం తప్పించి, ఎప్పుడైనా పనిచేశారా అని ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేని కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వస్తే ఏమో చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, మూడుచింతపల్లి ఎంపీపీ హారికామురళీగౌడ్, డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు చంద్రశేఖర్ యాదవ్, నాలిక యాదగిరి, డైరెక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.