Hyderabad | కంటోన్మెంట్, మే 11 : వేసవిలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు పేట్రేగిపోతున్నారు. దీంతో వారి ఆగడాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం.. రాత్రి సమయంలో ఆ ప్రాంతాలలో గస్తీ ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. నేరాలు, చోరీల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నేరాలు, చోరీలతో పాటు మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట వేయడంతో పాటు నేరస్తులను త్వరితగతిన పట్టుకోవచ్చని భావించిన పోలీసు అధికారులు నిఘా నేత్రాల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారులపై పలు ప్రాంతాలు, బస్తీలు, కాలనీల్లో వీటిని ఏర్పాటు చేసి భద్రతను పెంచారు. నార్త్ జోన్ పరిధిలోని బోయిన్పల్లి, కార్ఖనా, మారేడ్పల్లి, గోపాలపురం, తిరుమలగిరి, బొల్లారంతో సహా పలు పోలీస్ స్టేషన్ల పరిధిల్లో నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలోనే బోయిన్పల్లి ప్రాంతంలో నార్త్ జోన్ డీసీపీ వందకు పైగా నిఘా నేత్రాలను ప్రారంభించారు. ప్రధాన కూడళ్లతో పాటు అధికంగా జన సంచారం ఉన్న ప్రాంతాలు, ప్రజలు వాకింగ్ చేసే పార్కు ప్రాంతాల్లో నూతనంగా వీటిని ఏర్పాటు చేశారు.
నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొనేందుకు పోలీసులు నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై నిఘా నేత్రాల వలయంలో నార్త్ జోన్ పరిధిలోని ప్రతి బస్తీ, కాలనీలో ఉండనున్నాయి. ఈ మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకుని శక్తివంతమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పలు బస్తీల్లో దాతల సహకారంతో ప్రధాన కూడళ్లల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు వినియోగంతో నిందితులను గుర్తించడం సులభతరమని అధికారులు చెబుతున్నారు.
నార్త్ జోన్ పరిధిలోని అన్ని ఏరియాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాము. చోరీలు, నేర నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీటి ఏర్పాటుకు వ్యాపారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యా సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావాలి. నేర నియంత్రణకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఆయా స్టేషన్ ల పరిధిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షించి నేర నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం.
– వీ రామకృష్ణ, ఎస్హెచ్వో, కార్ఖానా