Kutumba Survey | హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో కులగణన సర్వే ఇష్టారీతిన కొనసాగుతున్నది. ఎక్కడాలేని విధంగా ఎన్యూమరేటర్లు పెన్సిల్‌తో డేటాను నింపుతూ, ఆపై పెన్నులతో డిక్లరేషన్ సంతకాలను తీసుకుంటున్నారని నగరవాసులు మండిపడుతున్నారు. దీంతో ఇందులో ఏదో రహస్య ఎజెండా ఉందని? అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వివరాలను వెల్లడించిన వారు కూడా సంతకాలు చేయకుండా, సర్వే ఫారాలను తీసుకుని ఎన్యుమరేటర్లను తిప్పి పంపుతున్న దుస్థితి నెలకొన్నది. మరోవైపు నగరంలో అనేక అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇతర ప్రాంతాల్లో సర్వే వివరాలను సేకరించిన పరిస్థితి నెలకొన్నది.
సర్వే సందర్భంగా ఎన్యుమరేటర్లు వ్యవహరిస్తున్న తీరుపైనా నగరవాసులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అనుమానాలను వెలిబుచ్చుతున్నారు. వాస్తవంగా సర్వే ఫారమ్‌లో మొత్తంగా 75 ప్రశ్నలకు సమాధానాలను నింపాల్సి ఉన్నది. వాటిని పెన్నుతో నింపాలి. ఆ తరువాత సర్వే పూర్తయిన అనంతరం సదరు గృహ యజమానికి ఆ ఫారాన్ని ఇచ్చి పూర్తిగా చదువుకున్న తరువాత సంతకం చేయించుకుని డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉన్నది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్యుమరేటర్లు అందుకు భిన్నంగా సర్వేను నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సర్వే ఫారం మొత్తాన్ని పెన్సిల్‌తో నింపుతున్నారని, ఆపై డిక్లరేషన్‌పై తమతో పెన్నుతో సంతకం చేయించుకుంటున్నారని గృహ యజమానులు మండిపడుతున్నారు. పెన్సిల్‌తో నింపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందులో ప్రభుత్వం రహస్య ఎజెండా ఏదైనా ఉందా? అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేటర్ల తీరుతో సర్వేలో పాల్గొనేందుకు ముందుకువచ్చిన వారు సైతం వెనుకడుగు వేస్తున్న దుస్థితి నెలకొన్నది. శుక్రవారం రోజున నగరంలో ఓ కాలనీ దాదాపు 50 ఇండ్లను ఓ ఎన్యూమరేటర్ సర్వే చేశారు. పెన్సిల్‌తో ఫారాలను నింపి, ఆపై డిక్లరేషన్‌పై మాత్రం పెన్నుతో సంతకం చేయాలని సూచించగా.. ఆ గృహ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదేమని నిలదీసినా జవాబు ఇవ్వకపోవడం, కనీసం సర్వే సూపర్వైజర్కు ఫోన్ చేయాలని నిలదీసినా బదులివ్వకపోవడంతో ఆ కాలనీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా అన్ని సర్వే ఫారాలను చించివేసి, మరోసారి కాలనీకి సర్వే పేరిట రావద్దని సదరు ఎన్యూమరేటర్‌ను తిప్పి పంపడం గమనార్హం. నగరం మొత్తంగా ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాతున్నది. సర్వే ఎందుకోసం? ఏ ప్రయోజనం చేకూరుతుందో ప్రభుత్వం ఏవిధమైన స్పష్టతనివ్వకపోవడంతోపాటు, క్షేత్రస్తాయిలో ఎన్యూమరేటర్ల తీరుతో నగరంలో మొత్తంగా సమాచార సేకరణ అరకొరగానే కొనసాగుతున్నదని తెలుస్తున్నది. ప్రస్తుతం సర్వేలో పాల్గొంటున్న దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి, స్లమ్ ఏరియాల్లోని వారు కూడా కుటుంబ వివరాలు తప్ప మరే ఇతర ఆస్తులు, ఆదాయ వివరాలను వెల్లడించేందుకు విముఖత చూపుతున్నారని వివరిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, కుల)ను 6వ తేదీ నుంచి ప్రారంభించింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల స్టిక్కరింగ్ మొదలు, ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే తీరు కూడా పూర్తిగా తప్పుల తడకగా కొనసాగుతున్న దుస్థితి నెలకొన్నది. సర్వే సాగుతున్న తీరుపై సామాజిక వేత్తలు, నగరవాసులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయాల్సిన ఇండ్లను గుర్తించి, స్టిక్కర్లు వేశారు.
అయితే ఈ క్రమంలోనే నగరంలోని అనేక మంది గృహ యజమానులు విముఖత చూపారు. స్టిక్కరింగ్ చేసేందుకు ససేమిరా అంగీకరించలేదు. దీంతో ఎన్యుమరేటర్లు సైతం చేసేదేమీలేకుండా ఆయా ఇండ్లను మినహాయించారు. అనేక సంపన్న శ్రేణులు నివాసముండే ప్రాంతాల్లోని ఇండ్లే కాకుండా, నగరంలోని అనేక అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో సర్వేనే కొనసాగడం లేదని సామాజికవేత్తలు, కులసంఘాల నేతలు వివరిస్తున్నారు. ఇక నగరంలో నివాసముంటున్న లక్షల మంది కిరాయిదారులు సైతం తమ వివరాలను నమోదు చేసుకోని పరిస్థితి నెలకొన్నది.
ఇదిలా ఉంటే స్టిక్కరింగ్ చేసిన ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తున్నారా? అంటే అదీ లేదని కుల సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి. తొలుత స్టిక్కరింగ్ చేయించుకున్న నగరంలోని గృహ యజమానులు సైతం ప్రస్తుతం సర్వేలో తమ వివరాలను వెల్లడించేందుకు విముఖత చూపుతున్నారని ఎన్యూమరేటర్లే వివరిస్తున్నారు. అదీగాక ఎన్యూమరేటర్లు ముందస్తు సమాచారం లేకుండా వెళ్తుండటంతో ఇండ్లలో ఎవరూ ఉండని పరిస్థితి నెలకొన్నది. దీంతో చేసేదేమీలేక ఆ ఇండ్లను సైతం సర్వే చేయకుండానే వదిలేస్తున్నారని, ఉన్నతాధికారులకు నివేదిస్తున్నామని ఎన్యూమరేటర్లు తెలుపుతున్నారు. సర్వే చేయడం సవాల్‌గా మారిందని ఎన్యూమరేటర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ): ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే నత్తనడకన సాగుతున్నది. ఈ నెల 9వ తేదీన ప్రారంభించిన సర్వే ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. 29 లక్షల కుటుంబాల లక్ష్యంగా సర్వే ప్రారంభం కాగా.. వారం రోజుల వ్యవధిలో 6,94,281 కుటుంబాలు సర్వే పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వేలో 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించి, 10 బ్లాక్‌లకు ఒక సూపర్ వైజర్లను నియమించిన అధికారులు, ఎన్యూమరేటర్లు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు.
ప్రతి ఎన్యూమరేటర్లకు 150 బ్లాక్‌లుగా కేటాయించిన ఇండ్లలో ఇప్పటి వరకు వారు అందజేసిన నివేదికలో ఇండ్లలో లేని వారి లెక్క తేల్చడం లేదు. పలు ప్రాంతాల్లో కొన్ని ఇండ్లు తాళాలు వేసి ఉండడం సాధారణమే. కానీ వాటి లెక్కలను జీహెచ్ఎంసీ వెళ్లడించడం లేదు. తాళాలు వేసిన ఇండ్లకు మరల వెళ్లి వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తామంటూ చెబుతున్నారే తప్ప ఆ దిశగా సర్వే జరపడం లేదు. ఫారంలోని వివరాల సేకణ పూర్తి స్థాయిలో జరగడం లేదని కార్పొరేటర్లు మండిపడుతున్నారు. మొత్తంగా సర్వేలో తప్పులు లేకుండా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్న క్షేత్రస్థాయిలో అంతా గందరగోళమే నెలకొంది. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులోగా నిర్ధేశిత లక్ష్యం పూర్తి చేయడం కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.