బంజారాహిల్స్, జూన్ 9: తనను కొంతమంది యువకులు కారులో వెంబడించడంతో పాటు తుపాకీతో న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాతబస్తీలోని చందూలాల్ బేలాలో నివాసం ఉంటున్న శైలేష్ సక్సేనా అనే న్యాయవాది ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులతో కలిసి కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్ . 12 మీదుగా ఫిలింనగర్ వైపునకు వెళ్తున్నారు. తమతో పాటు ఉన్న గన్‌మెన్‌ను వెంగళరావు బస్‌స్టాప్ సమీపంలో దింపేశారు. కొంతదూరం వెళ్లేలోగా నలుపు రంగు జాగ్వార్ కారులో వచ్చిన నలుగురు యువకులు అతడి కారును వెంబడించడం ప్రారంభించారు. గట్టిగా హార న్లు కొడుతూ కారును ఓవర్టేక్ చేసేందుకు యత్నించారు.
జానారెడ్డి నివాసం సమీపంలోకి రాగానే కారును ఓవర్ టేక్ చేస్తూ ‘నీ సంగతి చూస్తాం.. ఈరోజు నీ పని అయిపోయింది’.. అంటూ హెచ్చరించారు. దీంతో ఆందోళనకు గురైన శైలేష్ సక్సేనా వేగంగా కారును ముందుకు తీసుకువెళ్లారు. ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ వద్ద కారును ఢీకొట్టిన ఆగంతకులు కారును పక్కకు తీసుకువచ్చి ఎయిర్ రైఫిల్‌తో శైలేష్ సక్సేనాను బెదిరించారు. ఈ మేరకు బాధితుడు శైలేష్ సక్సేనా అర్ధరాత్రి తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాను ల్యాండ్ కేసుల్లో వాదిస్తుంటానని, దీంతో తనకు అనేకమంది శత్రువులున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా శైలేష్ సక్సేనాపై గతంలో బోజగుట్ట భూముల కబ్జాతో పాటు పలు రకాలైన సివిల్ క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసింది. అనంతపురానికి చెందిన టీడీపీ నేత దీపక్‌రెడ్డితో కలిసి బోజగుట్టలో 78ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలను సృష్టించిన ఘటనలో న్యాయవాది శైలేష్ సక్సేనా అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా శైలేష్ సక్సేనా ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.