Narayanaguda | హిమాయత్ నగర్ , జూన్ 19 : విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ముగ్గురు వ్యక్తులపై నారాయణగూడ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ యు చంద్ర శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం హయత్నగర్లో నివాసం ఉండే భాస్కర్, కిషోర్, బాలకృష్ణలు వన్ ప్లస్ సెల్ ఫోన్ మదర్ బోర్డు సమస్య ఉందని రిపేర్ కోసం రెండు నెలల క్రితం హిమాయత్ నగర్లోని వన్ ప్లస్ సర్వీస్ సెంటర్కు వచ్చి సెల్ఫోన్ ఇచ్చి వెళ్లారు. రోజులు గడిచిన రిపేర్ కోసం ఇచ్చిన సెల్ ఫోన్ ఇవ్వకపోవడంతో భాస్కర్, కిషోర్, బాలకృష్ణలు సెంటర్ సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో సెంటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గొడవపడే వారిని సముదాయిస్తుండగా మేము ఫిర్యాదు చేయలేదు. మిమ్మల్ని ఎవరు పిలిచారంటూ కస్టమర్లు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పీఎస్లో పోలీసులు ఫిర్యాదు చేయగా, సెంటర్ వద్ద వీరంగం సృష్టించారంటూ సెంటర్ మేనేజర్ సర్ఫరాజ్ సైతం భాస్కర్, కిషోర్, బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. రిపేర్కు ఇచ్చిన సెల్ ఫోన్ను ఇవ్వడంలో కాలయాపన చేయడంతో పాటు సెంటర్ సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు భాస్కర్, కిషోర్, బాలకృష్ణ ఆరోపిస్తున్నారు. సర్వీస్ సెంటర్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని వారు తెలిపారు. రెండు ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ చేప్పారు.