బంజారాహిల్స్, మార్చి 18: లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగిని గదిలో నిర్భందించి దాడికి పాల్పడిన ఘటనలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వై కిరణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే.. బుస ప్రియాంక్ అనే యువకుడు రెండు నెలల క్రితం సుచిర్ ఇండియా సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్‌లో వరంగల్ వెంచర్‌కు సంబంధించిన లెక్కల్లో రూ.5 లక్షలు అవకతవకలు జరిగినట్లు తేలింది. ఈ మొత్తాన్ని ప్రియాంక్ తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారాన్ని గురించి మాట్లాడదాం అంటూ సుచిర్ ఇండియా జీఎం మధుసూదన్ సోమవారం ప్రియాంక్ ను పిలిచారు. ఇద్దరు కలిసి నంది నగర్ లోని సుచిర్ ఇండియా ఎండీ కిరణ్ కు సంబంధించిన పాత ఆఫీసుకు వచ్చారు. కాసేపటికి అక్కడికి వచ్చిన సుచిర్ ఇండియా కిరణ్ డబ్బులు ఏం చేసావ్ .. అంటూ దుర్భాషలాడాడు. మర్యాదగా రూ.5 లక్షలు కట్టకపోతే అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురి చేశారు. సాయంత్రం దాకా గదిలో కూర్చోబెట్టి బయటకు వెళ్లాడు. కిరణ్ బయటకి వెళ్లిన తర్వాత ప్రియాంక్ డయల్ 100 కి కాల్ చేసి తనను గదిలో బంధించారు అని ఫిర్యాదు వేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని విడిపించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సుచిర్ ఇండియా ఎండీ కిరణ్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.