బంజారాహిల్స్,జనవరి 26: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌లోని జ్ఙానీజైల్సింగ్నగర్ బస్తీలో టీఎస్ నం. 1, బ్లాక్ ఎఫ్ వార్డు-9 పరిధిలోకి వచ్చే ప్రభుత్వ స్థలాన్ని బోగస్ పత్రాలతో ఆక్రమించుకునేందుకు కొంతకాలంగా సలీం, నౌషాద్ అనే వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ స్థలంలో నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఇటీవల షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఎన్నిసార్లు చెప్పినా.. ఆక్రమణల ప్రయత్నాలు మానుకోలేదు. దీంతో ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న సలీం, నౌషాద్ మీద చర్యలు తీసుకోవాలని షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం వారిద్దరి మీద బీఎన్ఎస్ 324(1), 329(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.