దుండిగల్, జూలై 8: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూ బకాసురులు కోట్లకు పడగలెత్తారు. వాటిని కొనుగోలు చేసిన అమాయకులు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. గాజులరామారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 307, 342 లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి గదులు నిర్మిస్తూ లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్న నలుగురు కబ్జాదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ నెలరోజుల క్రితం జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయినప్పటికీ అక్రమార్కుల్లో మార్పు రాకపోగా క్వారీ గుంతలను పోల్చడం, ప్రభుత్వ భూమిని చదును చేయడం, వాటిల్లో గదులు నిర్మించి విక్రయించడం వంటి వాటికి అడ్డుకట్ట పడటం లేదు. ఇదే సమయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు అధికమవడంతో రెవెన్యూ అధికారులు వారం క్రితం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వేనంబర్ 307 లో కబ్జాలకు పాల్పడుతున్నారని రాజు, రాజేంద్రలతో పాటు నరసింహ అనే భూ కబ్జాదారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
సర్వేనెంబర్342 కబ్జాలకు పాల్పడుతున్న శ్యామ్‌పై కేసు నమోదైంది. నరసింహపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రెవెన్యూ అధికారులు తమ ఫిర్యాదులో కోరినప్పటికీ పోలీసులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగద్గిరిగుట్ట సీఐని వివరణ కోరగా నరసింహ పై పీడీ యాక్ట్ నమోదుకు కావలసిన సమాచారం సేకరిస్తున్నామని పేర్కొనడం గమనార్హం.