సిటీబ్యూరో, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ)ః సరికొత్త ఆలోచన విధానాలతో యువతను మేల్కొలిపే విధంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్‌రావు రూపొందించిన కెరియర్ కన్సల్టేజ్ ఎంతో అభినందనీయమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం మాదాపూర్‌లోని కెరీర్ కన్సల్టేజ్ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు కెరీరీ కన్సల్టేజ్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న చదువు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనే కాంక్షతో విదేశీ విద్యాభ్యాస రంగంలో నేటి యువతరానికి దిశానిర్దేశం చేస్తూ సరికొత్త ఆవిష్కరణలే ప్రధాన లక్ష్యంగా రోహిత్‌రావు ముందుకు సాగుతుండటం గొప్ప విషయమన్నారు. ఓ పక్క రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవలు అందిస్తూ మరో పక్క తనకున్న అవగాహన అనుభవాలను యువతరానికి అందించాలనే లక్ష్యం పలువురికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలనే తపన ఎంతగా ఉన్న సరైన గైడెన్స్ లేక సమయాన్ని వృథా చేస్తూ వారి విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేసిన విద్యార్థులు ఎందరో ఉన్నారని కెరియర్ కన్సల్టేజ్ సీఈఓ మేనేని రోహిత్‌రావు అన్నారు. యువతీ యువకులకు సరైన సమయంలో విలువైన సలహాలతో కూడిన ప్రణాళిక అందించి విదేశీ విద్యారంగంలోని ముఖ్యమైన అంశాలను తెలియజేస్తూ ప్రపంచ దేశాల్లో వారికి సంబంధించిన అవకాశాలను అందించి వారి జీవితాలకు బంగారు బాటలు వేయడమే కెరియర్ కర్సల్టేజ్ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు సంస్థ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.