హైదరాబాద్: ప్రజాభవన్ ముందు కారు బీభత్సం (Accident) సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం ఓ కారు పంజాగుట్ట నుంచి అమీర్‌పేట వైపు వెళ్తున్నది. కారులో ఉన్న వ్యక్తి అతివేగంతో దూసుకెళ్తున్నాడు. పంజాగుట్ట వద్ద ప్రజాభవన్ సమీపానికి రాగానే కారు అదుపుతప్పింది. దీంతో పల్టీలు కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అందులో ఇరుక్కుపోయిన యువకులను బయటకు తీశారు.
చికిత్స నిమిత్తం వారిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి.. ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే రోడ్డుపై కంకర ఉండటంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.