హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట (Shamirpet) వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యారు. కారు శామీర్‌పేట నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో కారులో షార్ట్‌సర్క్యూట్ అయ్యింది.
దీంతో అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో డ్రైవర్ అందులో నుంచి బయటకు రాలేకపోయాడు. అతనితోపాటు కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో కారు బీభత్సం సృష్టించింది. దీంతో డ్రైవర్ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మచ్చబొల్లారంలోని సెలెక్ట్ థియేటర్ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి దుకాణాల మీదకు దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని భావిస్తున్నారు.