మణికొండ, నవంబర్ 14: ఔటర్ రింగ్‌రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల కొనుగోలు చేసిన కొత్త కారులో ఓ వ్యక్తి కుటుంబ సమేతంగా గచ్చిబౌలి నుంచి సంతోషంగా ఓ వివాహ శుభకార్యానికి వెళ్తున్నాడు.
మంచిరేవుల సమీపంలోని ఔటర్ రోడ్డుపై వెళ్తుండగా కారులోంచి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. కారులో ఉన్న చిన్న పిల్లలతో సహా ఐదుగురు హుటాహుటిన బయటకు వచ్చారు. అప్పటికే బానట్ పూర్తిగా కాలిపోయి.. కారు లోపలికి మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన బాటసారులు.. సమీపంలో మొక్కలకు నీళ్లు పడుతున్న పైపుతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, మంటలు ఏ మాత్రం అదుపులోకి రాలేదు. మంటలు ఎగిసి పడుతుండగా ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు సమయానికి రాకపోవడంతో కారు బుగ్గిపాలైంది. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.