Drunk and Drive | బంజారాహిల్స్ : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్న విషయాన్ని గమనించిన ఓ మందుబాబు కారును వెనక్కి తిప్పే క్రమంలో రోడ్డు మీద ఆగిన కార్లను ఢీకొడుతూ డివైడర్ మీదకు ఎక్కించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాచుపల్లి ప్రాంత నివాసి పాల్మాకుల మృదుల్ అనే యువకుడు(22),స్నేహితులు రితుల్కుమార్రెడ్డి(22), అంజయ్ మంతెన(22), మెన్నేని అజయ్ రావ్(21) జక్కుల విసాస్(24)లతో కలిసి ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీరంతా కలిసి బుధవారం రాత్రి మాదాపూర్లోని ఓ పబ్లో పీకలదాకా మద్యం సేవించి.. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం 10మీదుగా కారులో ఇంటికి బయలుదేరారు.
నవయుగ సమీపంలోకి రాగానే రోడ్డుపై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న మృదుల్ ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునేందుకు వేగంగా వెళ్తూ కుడివైపు డివైడర్ మీదుగా యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రోడ్డుమీద ఆగిన కారు (టీఎస్ 07ఈసీ 1717)ను వేగంగా వచ్చి డీకొట్టాడు. దీంతో కారు కుడివైపున నుజ్జునుజ్జయింది. అంతటితో ఆగకుండా కుడివైపు ఉన్న డివైడర్ మీదకు ఎక్కించి పారిపోయేందుకు యత్నించారు. అయితే కుడివైపు రోడ్డు తక్కువ ఎత్తులో ఉండడంతో కారు కిందకు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు నడిపిస్తున్న మృదుల్ చేయి విరగడంతో పాటు ఇతర యువకులకు స్వల్పంగా గాయాలయ్యారు.
ఈ ఘటనలో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు కారులో ఉన్న వారిని బయటకు తీసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. గాయపడిన మృదుల్తోపాటు కారులోని నలుగురు వ్యక్తులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా వారంతా మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు మృదుల్తో పాటు ఇతర యువకులపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.