సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పనిచేస్తున్నది. ప్రతియేటా వేసవిలో ఉండే డిమాండ్‌ను, కొత్త కనెక్షన్ల ద్వారా పెరిగే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికలతో నగరంలో విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను మెరుగుపర్చింది. ఇందుకోసం అవసరమైన చోట కొత్త లైన్లతో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత వేసవి సీజన్లో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండటంతో సరఫరా వ్యవస్థ సాఫీగా ఉంటుందని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అంతరాయం లేకుండా..!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అంశంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం అవసరమైన నిధులను సమకూర్చుతుండటంతో విద్యుత్ అంతరాయం అనే మాట వినిపించకుండా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా విషయంలో సీఎం కేసీఆర్ కోరుకున్నట్లుగా విద్యుత్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి, సరఫరాలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేసేలా యంత్రాంగం పనిచేస్తున్నది. తాజాగా గ్రేటర్ శివారు ప్రాంతమైన బాచుపల్లిలోని 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో ప్రస్తుతం రెండు 12.5 ఎంవీఏ సామర్థ్యంతో కూడిన పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, అదనంగా 8 ఎంవీఏ సామర్థ్యంతో పీటీఆర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం రూ.18.19లక్షలను ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సర్కిళ్ల వారీగా డిమాండుపై అంచనా..
నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కొత్తగా నివాసాలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు పెద్ద మొత్తంలోనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండు గణనీయంగా పెరుగుతున్నది. గ్రేటర్ పరిధిలో మొత్తం 9 విద్యుత్ సర్కిళ్లు ఉండగా, వాటిలో శివారు సర్కిళ్లు అయిన సైబర్ సిటీ, మేడ్చల్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్‌లలో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నట్లు గుర్తించారు. దానికి అనుగుణంగా ఆయా సర్కిళ్ల పరిధిలోని సబ్ స్టేషన్లలో విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచేందుకు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లోనూ ట్రాన్స్ఫార్మర్లను, లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చేలా నెట్వర్క్ సామర్థ్యాన్ని సిద్ధం చేసి ఉంచుతున్నారు. దీంతో కోర్ సిటీలోనే కాకుండా శివారు ప్రాంతాల్లో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.