Cantonment Board | కంటోన్మెంట్, జూన్ 22 : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడంతో పాటు ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోవడంతో బోర్డు ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ క్రమంలోనే కంటోన్మెంట్‌పై దృష్టి సారించిన రక్షణ శాఖ పాలకమండలి ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత నాలుగేళ్లుగా కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా దేశంలోని పలు కంటోన్మెంట్లను ఆయా స్థానిక మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రక్షణ శాఖ నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. ఎన్ని కమిటీలు వేసిన విలీనం కొలిక్కి రాకపోవడంతో పాటు కొత్త చట్టం ఆమోదం లభించకపోవడంతో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోవడంతో కంటోన్మెంట్ ఏరియాలో గత కొన్నేళ్లుగా అభివృద్ధి పడకవేసింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా పలు కంటోన్మెంట్లకు ఎన్నికలు నిర్వహించి, పాలకమండలిని ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లకు 2023 ఏప్రిల్ 30న ఎన్నికలు జరపాలని గతంలో రక్షణ శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కానీ ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని.. ఎన్నికలు వాయిదా వేస్తూ గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్ల ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని కొద్ది నెలల క్రితమే పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. త్వరలోనే మరికొందరు కూడా కోర్టుకు వెళ్లనుండటంతో ఎన్నికల నిర్వహణపై రక్షణ శాఖ మరోసారి దృష్టి సారించినట్టు సమాచారం. ప్రధానంగా కంటోన్మెంట్ విలీనంపై కేంద్ర రక్షణ శాఖ సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. ఎన్ని కమిటీలు వేసినా సమస్య కొలిక్కి రాకపోవడంతో ఎన్నికలపై రక్షణశాఖ దృష్టి సారించినట్లు తేటతెల్లమవుతుంది. అయితే ఎన్నికల నిర్వహణపై మాత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పందించడం లేదు.
సరిగ్గా పదేళ్ల క్రితం ఎన్నికలు జరగ్గా.. మళ్లీ ఎన్నికలకు మోక్షం ఎప్పుడో అని స్థానిక ప్రజానీకం ఎదురుచూస్తుంది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు 2015లో ఎన్నికలు నిర్వహించారు. అదే ఏడాది.. ఫిబ్రవరిలో ఎన్నికైన బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. 2020 ఫిబ్రవరితో వాళ్ల పదవీ కాలం ముగిసింది. కానీ.. మళ్లీ ఎన్నికలు జరపలేదు. రెండు రోజుల క్రితం విపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు బోర్డు సీఈఓ ను కలిసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. మరోవైపు నామినేటెడ్ సభ్యులుగా ఉన్న నర్మదా, మల్లికార్జున్ సైతం ఎన్నికల నిర్వహణపై రక్షణ శాఖ అధికారులతో సంప్రదింపులు చేస్తామని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా బోర్డు మాజీ సభ్యులతో పాటు, నామినేటెడ్ సభ్యుడిగా పనిచేసిన నాయకుడు సైతం కేంద్ర సర్కారుతో నిత్యం టచ్ లో ఉంటూ ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.
గతంలో ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడటం, జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం చేస్తారంటూ ప్రచారం జరగడంతో అప్పటి ఆశావాహులు అందరూ ప్రజాక్షేత్రాన్ని విడిచి ఎవరి పనిలో వాళ్లు పడిపోయారు. కానీ ప్రస్తుతం విలీనం కథ కంచికి చేరినట్లే తెలుస్తుంది. దీంతో ఎన్నికలకు పోవాలని రక్షణ శాఖ యోచిస్తుండటంతో పాలక మండలికి ఎన్నికలు జరగబోతున్నట్లు తాజాగా మళ్లీ ఊహాగానాలు వినిపిస్తుండటతో ఆశావాహులు మళ్లీ అప్రమత్తమవుతున్నారు. చూడాలి మరి ఈ సారైనా ఎన్నికలు జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే….