Cable Wires | సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): నగరంలో విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేస్తున్న కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ వైర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. విద్యుత్ స్తంభాలపై కేవలం 4 వరుసలతో మాత్రమే కరెంటు తీగలు ఉంటే.. ఆ స్తంభాలపై 20 నుంచి 30 వరుసలతో కూడిన కేబుల్ వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి.
ఇవి ప్రమాదంగా మారుతుండటంతో నగర ప్రజలతో పాటు ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు తరచూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దుమారానికి విద్యుత్ తీగలు తగిలినప్పుడు మెరుపులు వచ్చి అవి కేబుళ్ల మీద పడి..మంటలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రధాన రహదారుల మీదే జరుగుతుండటంతో వాహనదారులు, పాదచారులు నిత్యం భయాందోళనలకు గురవుతున్నారు.
నగరంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ప్రైవేటు సంస్థల పరిధిలోనే ఉంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఎవరికీ వారుగా తమకు కంపెనీకి చెందిన 20 నుంచి 30 తీగలను విద్యుత్ స్తంభాలకు వేలాడదీస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇష్టారాజ్యంగా కేబుళ్లు ఏర్పాటవుతున్నాయి.
విద్యుత్ శాఖకు చెందిన స్తంభాలపై కేబుళ్లు ఏర్పాటు చేసేందుకు.. ఆ శాఖ నుంచి అనుమతి కూడా తీసుకోవడం లేదు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సైతం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కేబుళ్లు విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
విద్యుత్ సిబ్బంది స్తంభాలను ఎక్కి మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు కుప్పలుతెప్పలుగా ఉంటున్న కేబుల్ తీగలు అడ్డంకిగా మారుతున్నాయి. భారీ క్రేన్లను తెప్పించి కేబుళ్లు తగలకుండా పనులు చేయాల్సి వస్తోందని, అయినా ఆ సమయంలో అవి తమ క్రేన్స్కు అడ్డుగా వస్తున్నాయని విద్యుత్ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. దీనికితోడు భారీ వాహనాలు వెళ్లినప్పుడు కిందకు వేలాడుతున్న కేబుళ్లు తెగి.. విద్యుత్ వైర్లకు తాగి..మెరుపులు కూడా వస్తున్నాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే వారు కేబుళ్లు తగిలి ప్రమాదాల బారిన పడుతున్నారు.