e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home జిల్లాలు రెరా అనుమతి ఉంటేనే ఫ్లాట్‌ కొనండి

రెరా అనుమతి ఉంటేనే ఫ్లాట్‌ కొనండి

  • యూడీఎస్‌, ప్రీ లాంచ్‌లపై యుద్ధమే..!!
  • నిర్మాణ రంగానికి క్యాన్సర్‌లా మారిన అమ్మకాలు
  • హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కాపాడుతూ ఏకమైన బిల్డర్లు
  • నిర్దిష్టమైన ప్రణాళికలతో ఒక్కతాటిపైకి నిర్మాణ సంఘాలు
  • రెరా అనుమతి లేని ప్రాజెక్టుల్లో కొనుగోలు చెయ్యొద్దంటూ బయ్యర్లకు అవగాహన
  • యూడీఎస్‌పై ఉక్కుపాదం లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి అడుగులు

సిటీబ్యూరో, నవంబర్‌ 26 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్‌ రియల్‌ రంగం మీదపడి దోచుకుంటున్నవారి భరతం పట్టాలని నిర్మాణ సంఘాలు నిర్ణయించాయి. యూడీఎస్‌, ప్రీ లాంచ్‌ సేల్స్‌ని అరికట్టేందుకు కలిసికట్టుగా యుద్ధ భేరి మోగించాయి. క్రెడాయ్‌ హైదరాబాద్‌, ట్రెడా, టీబీఎఫ్‌, టీడీఏ వంటి నిర్మాణ సంఘాలు యూడీఎస్‌, ప్రీ లాంచ్‌ అమ్మకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచి, అక్రమార్కుల భరతం పట్టేలా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. శుక్రవారం బంజారాహిల్స్‌లోని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. రెరా అనుమతి లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లు కొనకూడదంటూ కొనుగోలుదారులకు విజ్ఞప్తి చేశారు. యూడీఎస్‌, ప్రీ లాంచ్‌ సేల్స్‌ అనేవి నిర్మాణ రంగానికి ఒక క్యాన్సర్‌ భూతం లాంటిదన్నారు. ఈ మహమ్మారి బారినపడి ఇబ్బందులు పడవద్దన్నారు. బయ్యర్లంతా అప్రమత్తంగా ఉండాలని విన్నవించారు. యూడీఎస్‌ సంస్థలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని అభ్యర్థించారు.

అప్రమత్తమైన నిర్మాణ రంగ సంస్థలు..
హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో ప్రస్తుతం జరుగుతుంది ఏమిటీ..? ఒకప్పుడు ఢిల్లీలోని గుర్గావ్‌, నోయిడాలో జరిగినట్టుగా రియల్‌ మోసాలు జరుగుతున్నాయా..? అంటే ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. స్థల యజమానితో మాట్లాడేదొకరు.. అతడికి అడ్వాన్స్‌ ఇచ్చేది మరొకరు.. ఆ స్థలాన్ని మార్కెట్లో అమ్మకానికి పెట్టేది ఇంకొకరు.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లతో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించేదొకరు.. కొన్న ప్లాటు లేదా ఫ్లాటుకు సంబంధించిన యూడీఎస్‌ స్థలాన్ని రిజిస్టర్‌ చేసేది మరొకరు.. మొత్తానికి బిల్డర్‌తో కొనుగోలుదారులకు ప్రత్యక్ష సంబంధం లేకుండానే రియల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. రెరా అనుమతి లేని ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసి మోసపోయామని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఎలాగైనా యూడీఎస్‌, ప్రీ లాంచ్‌ అమ్మకాల్ని అరికట్టేందుకు నిర్మాణ రంగ సంస్థలు నడుం బిగించాయి. యూడీఎస్‌, ప్రీ లాంచ్‌ అమ్మకాలను నిరోధించేందుకు కలిసికట్టుగా ఒక్క తాటిపైకి వచ్చి యుద్ధం ప్రకటించాయి.

- Advertisement -

బీ స్యూర్‌, బీ సేఫ్‌
రియల్‌ ఎస్టేట్‌లో అనుభవంలేని కొందరు అత్యంత ఆకర్షణీయమైన ప్రకటనలతో భూమిలో అన్‌డివైడెడ్‌ షేర్‌ చూపి ప్రీ సేల్‌/ ప్రీ లాంచ్‌ అంటూ తమ ప్రాజెక్టుల విక్రయాలను జరుపుతున్నారు. డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరా అనుమతులు లేకుండానే విక్రయాలు జరుపుతూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. ప్రజలు తక్కువ ధర ఆశకు పోయి రెరా అనుమతి లేని ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తూ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. రెరా అనుమతించిన ప్రాజెక్టుల్లోనే కొనుగోళ్లు జరపండి. కచ్చితంగా ఉండండి.. సురక్షితంగా (బీ స్యూర్‌, బీ సేఫ్‌) ఉండండి.

  • పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

హైదరాబాద్‌కు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది :
హైదరాబాద్‌కు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. క్యాన్సర్‌ మహమ్మారిలా మారిన ప్రీ సేల్స్‌, ప్రీ లాంచ్‌, యూడీఎస్‌ అమ్మకాలను ఎక్కడికక్కడ నియంత్రించాలి. రెరా అనుమతించిన ప్రాజెక్టుల్లో మాత్రమే కొనుగోళ్లు జరిపి సురక్షితంగా ఉండాలి.

  • ఆర్‌.చలపతి రావు, ట్రెడా అధ్యక్షుడు

ఇది ఆరంభం మాత్రమే
త్వరగా ఎదగాలనే కొంత మంది డెవలపర్ల ఆశ కొనుగోలుదారులను నిట్టనిలువునా ముంచేసే పరిస్థితికి తీసుకెళ్తుంది. అధిక రేట్లకు భూములు కొనేసి, అనంతరం స్థలానికి సంబంధించిన అవిభాజ్యపు వాటా (యూడీఎస్‌) ముందుగానే అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది రెరా నిబంధనలకు విరుద్ధం. కొనుగోలుదారులు సైతం తక్కువ ధరకు ప్లాట్‌ వస్తుందనే కారణంతో వీరి మాయలోపడి చివరకు మోసపోతున్నారు. ఈ మోసగాళ్ల భరతం పట్టేందుకు రంగంలోకి దిగాం.. అదిగో ప్లాటు అంటూ ఖాళీ స్థలాన్ని చూపిస్తూ అమ్మేస్తున్న వారికి అల్టీమేటం ఇస్తున్నాం. పద్ధతి మార్చుకోవాలి. వచ్చే ఆరు నెలల పాటు ప్రజల్లో యూడీఎస్‌, ప్రీ లాంచ్‌ అమ్మకాలను నియంత్రించడమే లక్ష్యంగా మా కార్యాచరణ ఉంటుంది.

  • వి. రాజశేఖర రెడ్డి , జనరల్‌ సెక్రటరీ, క్రెడాయ్‌ హైదరాబాద్‌

ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలి
111 జీవో పరిధిలో, దాని పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అత్యధిక సంఖ్యలో యూడీఎస్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం సైతం నిర్మాణ రంగ అనుమతులు ఇచ్చే ప్రభుత్వ శాఖల్లో టోల్‌ ఫ్రీ నంబర్‌ను నిరంతరం అందుబాటులో ఉంచాలి. దీంతో ప్రాజెక్టుకు అనుమతి ఉందా..? ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టవచ్చా..? లేదా అని ప్రజలు తెలుసుకుని అవకాశం ఉంటుంది. – జీవీరావు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement