శంషాబాద్ రూరల్, జూలై 11: విధులు ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్న ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన హౌస్ కీపింగ్ సిబ్బంది రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రోటరీ 3- రోటరీ 4 మధ్య గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్ట్ సీఐ బాల్‌రాజు వివరాల ప్రకారం.. వీఏఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది విధులు ముగించుకొని ఆటో (AP28TC2640)లో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని బస్సు వెనుక నుంచి వచ్చి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నల్లగొండ జిల్లా కంబాలపల్లి మంగళ్ తండాకు చెందిన లక్ష్మయ్య (50) అక్కడికక్కడే మరణించారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఉడిమియల్లాకు చెందిన డి. హన్మంతు (29) తీవ్ర గాయాల పాలై శంషాబాద్‌లోని ఆర్కాన్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉండగా.. కె.విజయ, ఎం.భాగ్య, డి.హన్మంతు, జి.రూపాదేవి, ఎం. రాము, డి.వెంకటమ్మ, ఆర్.లక్ష్మ, డి.ఝాన్షి, ఆర్. శంకర్, జి.నిర్మల, ఎం.బుజ్జి, ఆర్.లక్ష్మి, ఆటో డ్రైవర్ ఎస్. నాగరాజు గాయాల పాలయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.