బండ్లగూడ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు మరిగి ఎదో ఒక సాకు చెబుతూ అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్నారు. దాంతో కార్పొరేషన్ అదాయానికి భారీ స్థాయిలో గండిపడుతోంది. అధికారుల చేతి వాటంతోనే అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి.
నగర శివారును అనుకుని ఉండటంతో గృహ నిర్మాణదారులు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నగరానికి ఐటీ రంగానికి అనువుగా ఉండటంతో ప్రజలు ఇక్కడ ఇళ్లు కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా చూసుకుని భవన నిర్మాణాదారులు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరైతే జీ ప్లస్ టూ అనుమతులు తీసుకుని ఐదు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు.
ఆరె మైసమ్మ ప్రధాన రహదారి వద్ద వంద నుంచి నూటా యాబై గజాల స్థలంలో సెల్లార్ తీసి నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని అడిగితే అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని స్థానికులు వాపోయారు.హైదర్షాకోట్ గ్రామంలోకి వచ్చే ప్రధాన రహదారి పక్కనే గ్రామ పంచాయతి అనుమతులతో ఉన్న ఇంటిపై అదనంగా మూడు అంతస్తులను నిర్మిస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి నిర్మాణాలు అనేకం చోటు చేసుకుంటుండగా వాటిని అడ్డుకోవలసిన అధికారులు అమ్యామ్యాలకు మరిగారు. దీంతో కార్పొరేషన్‌కు భారీ గండిపడుతోంది. అధికారుల తీరుపై ఉన్నాతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నా అధికారులు అవేమీ తమకు పట్టనట్టుగా వ్యవరిస్తున్నారని, ఫిర్యాదు చేస్తే నోటీసులు పంపుతామని నిర్లక్ష్యంగా చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.
అక్రమ నిర్మాణదారుల నుంచి లంచాలు తీసుకుంటూ ఆధికారులు వారికి కొమ్ముకాస్తున్నారని విమర్శిస్తున్నారు. అధికారులు స్లాబ్ స్లాబ్‌కు రేటు కట్టి మరీ నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణదారులు జీ ప్లస్ టు అనుమతులు తీసుకుని ఐదు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరైతే అధికారులకు ముడుపులు ముట్టజెప్పి నూరు నూటాయాభై గజాల స్థలంలోనే సెల్లార్లు తీసి సెట్ బ్యాకులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు.