సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలన్నీ సందేహాల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల కోసం ఇన్నాళ్లు డీటీసీపీని ఆశ్రయించిన బిల్డర్లు, సాధారణ జనాలు.. ఇప్పుడు హెచ్ఎండీఏ బాట పట్టాల్సి వస్తున్నది. కొత్తగా 300కు పైగా గ్రామాలను విలీనం చేసి, 11 జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ మూడు నెలల కిందటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ భవన నిర్మాణ అనుమతుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికీ స్థానికంగా చేపట్టలేదు. దీంతోపాటు టీజీబీపాస్ను తొలగించిన పురపాలక శాఖ, దానికి బదులుగా బిల్డ్ నౌ తీసుకొచ్చింది. కానీ అనుమతుల విషయంలో డీటీసీపీని ఆశ్రమించిన వారు, పలు దశల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్ల విషయంలో మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్త దరఖాస్తులను బిల్డ్ నౌ ఆధారంగానే పరిశీలించి అనుమతులు జారీ చేస్తున్నా… పాత దరఖాస్తుల వ్యవహారం సందిగ్ధానికి కారణమవుతున్నది.
ఏడు జిల్లాలకు పరిమితమైన హెచ్ఎండీఏలో 300కు పైగా గ్రామాలను విలీనం చేసిన ప్రభుత్వం 11 జిల్లాల పరిధిలో 10500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కొత్త పరిధిని నిర్మిస్తూ జీవో నం. 68ను మార్చి రెండో వారంలో జారీ చేసింది. విలీనమైన గ్రామా ల్లో భవన నిర్మాణ అనుమతులన్నీ ఇకపై డీటీసీపీ నుంచి మారిపోవాలి. కానీ గతంలోనే డీటీసీపీలో చేసిన దరఖాస్తులు, చెల్లించిన ఫీజుల వ్యవహారాన్ని సర్దుబాటు చేయాల్సిన ప్రభుత్వం ఆ విషయాన్ని మరిచింది.
డీటీసీపీ గ్రామాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకున్నా… అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, హెచ్ఎండీఏ విఫలమైంది. కనీసం విలీన గ్రామాల్లో పరిధిలో జీవోకి ముందుకు చేసిన దరఖాస్తులను కూడా హెచ్ఎండీఏ వస్తాయని ప్రకటించకపోవడమే ఇప్పుడు సమస్యకు కారణమైంది. అదేవిధంగా పాత దరఖాస్తులను డీటీసీపీలోనే కొనసాగించి, నిర్ణీత గడువు నుంచి హెచ్ఎండీఏ నిబంధనలు అమల్లోకి వస్తాయని చెప్పినా.. ఈ సందేహాలకు అవకాశం ఉండేది కాదు.
కానీ ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయకుండా, గ్రామాలను విలీనం చేస్తూ, శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దీంతో దరఖాస్తుదారులు, నిర్మాణ సంస్థలు కూడా ఆందోళన చెందుతున్నాయి. దీంతోనే దరఖాస్తుదారులు అటు హెచ్ఎండీఏ, ఇటు డీటీసీపీ అధికారులను సమన్వయం చేసుకోవడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.