హైదరాబాద్ : అనుమానం పెనుభూతమైంది. అనుమాతనంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు. జూనియర్ ఆర్టిస్టుగా(Former junior artist) పనిచేసిన మహిళను ఆమె భర్త గొంతు నులిమి హత్య చేశాడు (Brutal murder). రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీకి చెందిన మద్దూరి అనురాధ (36) హత్యకు గురైనట్లు పట్టణ సీఐ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. మల్లికార్జున కాలనీలో నివాసం ఉంటున్న మద్దూరి అనురాధ, శివరామయ్య దంపతులు తరచుగా గొడవపడేవారని వివరించారు. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన అనురాధను భర్త శివరామయ్య నిత్యం అనుమానించే వాడన్నారు.
సోమవారం ఉదయం 9 గంటల సమయంలో అనురాధ కూతురు నందినికి తండ్రి ఫోన్ చేసి అనురాధ ఆత్మహత్య చేసుకుందని సమాచారమిచ్చి పరారయ్యాడు. బంధువులు అనుమానంతో అనురాధ మృతదేహాన్ని పరిశీలించగా గొంతు నులిమి చంపిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నారు. తన తల్లిని తండ్రి శివరామయ్య హత్య చేసినట్టు కూతురు నందిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.