గోల్నాక, అక్టోబర్ 19 : అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ అంబర్‌పేట, సాయిబాబానగర్ కాలనీలో మూడంతస్థుల భవనంలోని కింద ఫ్లోర్లో పి.లింగారెడ్డి(71), ఊర్మిలాదేవి(69) వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. లింగారెడ్డి పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహించి రిటైర్డ్ కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలు.
పెద్ద కుమార్తె కుటుంబం కొంపల్లిలో నివిసిస్తుండగా, మిగిలిన ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. కాగా.. గత గురువారం ఉదయం కొంపల్లిలో ఉండే పెద్ద అల్లుడు జైపాల్.. అత్తమామలతో ఫోన్ మాట్లాడి.. తిరిగి శనివారం ఉదయం ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. వెంటనే అదే ప్రాంతంలో ఉండే స్నేహితుడు రవీంద్రకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. అతను ఉదయం 11గంటల సమయంలో వెళ్లి తలుపులు తెరిచి చూడగా.. లింగారెడ్డి, ఊర్మిలా దేవిలు హత్యకు గురై ఉన్నారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు..డాగ్ స్కాడ్, క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లింగారెడ్డి మృతదేహం బెడ్ రూంలో రక్తపు మడుగులో పడి ఉండగా, ఊర్మిల దేవి మృతదేహం బాత్రూంలో పడి ఉంది. వీరిని బలమైన వస్తువులతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్న్నారు. ఊర్మిలదేవి చేతికి ఉండాల్సిన బంగారు గాజులతోపాటు మెడలో పుస్తెలతాడు లేదని పోలీసులు గుర్తించారు.
వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటున్నట్లు గుర్తించిన వ్యక్తులే ఈ హత్యలు చేసి ఉం టారా.. లేక దొంగతనానికి వచ్చిన దుండగులు హత్యచేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండడంతో ఈ హత్యలు గత గురువారం రాత్రి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని .. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.