దుండిగల్, నవంబర్ 8: ఒంటరి మహిళ దారుణహత్యకు గురైన దారుణ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతి(30)కి 10 ఏండ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్తతో విభేదాలు తలెత్తడంతో ఏడాదిన్నర క్రితం కొడుకులను తీసుకుని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటుంది. తరచూ కిరాయి డబ్బుల కోసం ఇంటి యజమాని కిషన్.. స్వాతి వద్దకు వస్తుడంటంతో ఇద్దరి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో స్వాతి కుటుంబ పోషణ బాధ్యతలను కిషనే చూసుకుంటున్నాడు.
ఈ విషయం కిషన్ ఇంట్లో తెలియడంతోపాటు భార్య, పిల్లలను సరిగ్గా పట్టించుకోకపోవడంతో కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కిషన్ మేనల్లుడైన బోయ రాజేశ్ (27), తన స్నేహితుడితో కలిసి బహదూర్‌పల్లిలోని స్వాతి ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చి కత్తితో స్వాతి గొంతు కోసి హతమార్చారు. అనంతరం రాజేశ్ నేరుగా దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అతని స్నేహితు డు మాత్రం పరారీలో ఉన్నాడు. అయితే హతురాలి చిన్న కొడుకు హర్షవర్ధన్ కండ్ల ముందే తల్లి హత్య జరగడంతో హర్షవర్ధన్ బిగ్గరగా ఏడవడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా స్వాతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, దుండిగల్ సీఐ సతీశ్, సూరారం సీఐ సుధీర్‌కుమార్‌లు సందర్శించారు.
అత్త కండ్లల్లో ఆనందం కోసమేనా?
కిషన్, లక్ష్మి దంపతులకు రాజేశ్ మేనల్లుడు. అదే సమయంలో రాజేశ్‌కు వారి కూతురిని ఇచ్చి వివాహం చేసినట్లు తెలుస్తున్నది. అయితే కిషన్‌కు స్వాతితో వివాహేతర సంబంధం ఏర్పడడంతో భార్య, కుటుంబసభ్యులను పట్టించుకోవడంలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే లక్ష్మి తరచూ బాధపడటం చూసిన అల్లుడు రాజేశ్ తన మిత్రుడితో కలిసి స్వాతిని హతమార్చినట్లు సమాచారం. స్వాతిని హత్య చేసిన అనంతరం రాజేశ్ నేరుగా దుండిగల్ పీఎస్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తుండగా, పోలీసులు మాత్రం తామే అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.