సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం చరిత్రలో ఇదే తొలిసారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నా రు. యాజమాన్యాలు బంద్ ప్రకటించే దుస్థితికి చేరడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కల్టెరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ ముకుందరెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రూ.8వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల కమీషన్ల కోసం కాంట్రాక్టు బిల్లులను విడుదల చేస్తున్నారు కానీ, 20 లక్షలకు పైగా ఉన్న విద్యార్థుల రీయింబర్స్మెంట్ బిల్లులను మాత్రం విడుదల చేయడం లేదని విమ ర్శించారు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువుల కోసం వెళ్లడానికి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామనడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని వాపోయారు.
ప్రభుత్వం కండ్లు తెరిచి బకాయిలు చెల్లించకుంటే ప్రతి విద్యార్థిని కదిలించి సచివాలయా న్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తక్షణమే విద్యారంగం లోని అన్ని రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్వీ నేతలు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, అశ్వంత్ గుప్తా, జంగయ్య, ప్రశాంత్ గౌడ్, యాదక్రాంతి, విశాల్, రహమత్, శ్రీకాంత్, నాగేంద్రరావు, నర్సింగ్, రాహుల్, హైదర్, అక్షయ్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.