BRSV : తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం భగ్గుమంది. లోక్ సభ వేదికగా తెలంగాణ అమరవీరుల త్యాగాలను, కోట్లాది ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ పోరాటాన్ని అవమనించిన ఎంపీ సూర్య వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్వీ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అవహేళన చేసే హక్కు ఎవరికీ లేదని బీఆర్ఎస్వీ నాయకులు తేల్చి చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంపీ తేజస్వీ సూర్య దిష్టిబొమ్మ దహనం సందర్భంగా ఓయూ బీఆర్ఎస్వీ నాయకులు నాగేందర్ కోధాటి మాట్లాడుతూ ‘తేజస్వీ సూర్య గుర్తుంచుకో.. తెలంగాణను భిక్షగా తెచ్చుకోలేదు. కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియకపోతే ముందుగా చదువు. తర్వాత ఈ నేల గురించి మాట్లాడు.
తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసే ప్రతి శక్తికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇవ్వడం ఈ నేలకి తెలుసు. వెంటనే నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ విద్యార్థిలోకం, ఉద్యమ శక్తి బీజేపీకి రాజకీయంగా సమాధానం చెబుతుంది’ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు నాగేందర్ కోధాటి, నిఖిల్ పటేల్, పవన్ దేవాన్ష్, రాజు, మనోజ్, సూర్య, అశోక్, లావిష్, రవీంద్ర, ప్రకాష్ పాల్గొన్నారు