పేదల గూడు కూలగొట్టి, వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ సృష్టించిన కన్నీటీ సునామీ మూసీ ప్రాజెక్టు అని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటి నిండా కునుకు లేకుండా కాంగ్రెస్ సర్కార్ చేస్తే.. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాలతో కలిసి భరోసా కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజకీయాలను కన్నెర్ర చేస్తున్న విద్యార్థులు.. మూసీ వెంబడి ఇంటింటికీ తిరుగుతూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటామని, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని బాధితులతో కలిసి పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్వీ చేపట్టిన పోరుబాట బుధవారం నాటికి ఐదోరోజుకు చేరింది. ఈ సందర్భంగా అంబర్‌పేట నియోజకవర్గంలో ఉన్న మూసీ పరివాహాక బస్తీల్లో విద్యార్థి నేతలు సందర్శించారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్, కాచిగూడ డివిజన్లోని కృష్ణానగర్ కాలనీల్లో బీఆర్ఎస్వీ నాయకులు ఇంటింటికి తిరిగి బాధితులతో ధైర్యాన్ని నింపారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చేస్తామంటూ సర్కార్ చేస్తున్న మార్కింగ్‌లను చూసి వణికిపోతున్న పేదలకు తామున్నమంటూ భరోసానిచ్చారు. పేదల ఇండ్లను కూల్చి, బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ మూసీ వెంబడి అక్రమ సామ్రాజ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. బడా కార్పొరేట్ కంపెనీలకు మూసీ భూములను కట్టబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రణాళికలను బీఆర్ఎస్వీ అడ్డుకుంటుందన్నారు.

పేదలపై ప్రతాపమా?
బీఆర్ఎస్వీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్పొరేట్ సంస్థల కడుపునింపేందుకు పేదల ఇండ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ హయాంలో పేదలకు పట్టాలిచ్చి అండగా నిలిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లను రోడ్డున పడేసేందుకు సిద్ధమవుతున్నదని మండిపడ్డారు. ముఖ్యంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి అంబర్‌పేట మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న కాంగ్రెస్ దుర్మార్గ చర్యలను నిలువరించేలా విద్యార్థులు అంతగా ఐక్యంగా పోరాడుతామన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఇండ్లపై చేసిన మార్కింగులను తొలగించాలన్నారు. బలవంతపు కూల్చివేతలకు పాల్పడితే ప్రతి గల్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
రాజేంద్రనగర్ జియాగూడ నుంచి అంబర్‌పేట కృష్ణానగర్ వరకు సాగుతున్న భరోసా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మొండి వైఖరి వీడే వరకు కొనసాగిస్తామని బీఆర్ఎస్వీ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పోరుబాట ఉత్సాహంగా కొనసాగిస్తుండగా, మూసీ బాధితులకు భరోసా కోసం చివరి వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ముఖ్యనేతలు విజయ్ రావు, శిగ వెంకటేశ్‌గౌడ్, సూరంపల్లి పరుశురాం, మోటపోతుల రమేశ్‌గౌడ్(ఓయూ) తదితరులు పాల్గొన్నారు.