ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఓయూ మెయిన్ లైబ్రరీలో సంతకాలు సేకరించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయడంతో పాటు అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష సంతకాలను సేకరించి సమర్పించనున్నట్లు వివరించారు. సమగ్ర విచారణ జరిపేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. నిరుద్యోగుల సంతకాలు సేకరిస్తుంటే ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.