సిటీ బ్యూరో/అంబర్‌పేట ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ప్రజల్లోకి చేరవేసేందుకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని బృందాలు పరీవాహక ప్రాంతాల్లో కదం తొక్కి ముందుగు సాగుతున్నాయి. నాలుగు రోజులుగా బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలు 50 బృందాలుగా ఏర్పడి మూసీ పరీవాహక బస్తీలు, కాలనీల ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. బస్తీల్లోని ప్రతి ఇంటిని సందర్శించి.. మూసీ బాధితులకు ప్రభుత్వ భూ దోపిడీని సవివరంగా తెలియజెప్పుతున్నారు. మూసీ సుందరీకరణ పేరిట కా్రంగెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్ల దోపిడీని అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు.
బస్తీలను చెరబట్టి పేదల ఇండ్లను కూల్చి పెద్దలకు పెట్టాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రచిస్తున్న వ్యూహరచనను తిప్పిగొడుతూ ఇండ్లను కాపాడుకునేందుకు కలిసి కట్టుగా కదం తొక్కాలని బాధిత ప్రజలకు సూచిస్తున్నారు. మూసీ పేరిట రేవంత్‌రెడ్డి చేయబోయే రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యూహాలను పోస్టర్లు, కర పత్రాల రూపంలో ముద్రించి బాధిత ప్రజలకు పంచుతున్నారు. బస్తీలు, కాలనీల్లోని మేధావులు, విద్యావంతులు బయటకు వచ్చి పోరాటాలు చేయాలని హితబోధ చేస్తున్నారు. మూసీ పరీవాహకంలోని ప్రజల్లో మనోధైర్యం నింపుతూ బీఆర్ఎస్ పార్టీ,గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలోని బీఆర్ఎస్వీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. ఇండ్లు, భూములను కోల్పోతామని ఎవరూ అధైర్యపడొద్దని, రెండేండ్లు ఇండ్లను కాపాడుకుంటే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అప్పుడు తమ ఇండ్లకు భద్రత కల్పిస్తామని వెల్లడిస్తూ ముందుకు సాగుతున్నారు.
బాధితులకు వాల్‌పోస్టర్లతో అవగాహన..
మూసీ పరీవాహకం అంతటా బీఆర్ఎస్వీ విద్యార్థి నేతలు, కార్యకర్తలు కలియతిరిగి బాధితులను కలుస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని వివరిస్తున్నారు. అందులో భాగంగా అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ దుర్గానగర్, ఆజాద్ నగర్, అన్నపూర్ణ నగర్, అంబేద్కర్‌నగర్ కాలనీల్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌రావు, ప్రధాన కార్యదర్శులు శిగ వెంకట్ గౌడ్, పరశురామ్ సహా నేతలు మిథున్, నాగేందర్, అవినాశ్ అంబర్పేట్ ఇన్చార్జి రాహల్ సహా బృందం సందర్శించింది. మలక్‌పేటలోని శంకర్‌నగర్ బస్తీ వాసులకు బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ మనోధైర్యం కల్పించారు. కేసీఆర్ 31 ఎస్టీపీలను కట్టి మురుగును పారదోలితే రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను ఆగం చేస్తున్నడని ఆరోపించారు.
మలక్‌పేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి పాట రూపంలో బాధితులకు భరోసా కల్పించారు. బీఆర్ఎస్వీ నేత విశాల్ బృందం బాధితులను కలిసి భరోసా కల్పించారు. అత్తాపూర్‌లోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ ప్రతినిధులు అశ్వంత్, గిరీశ్, రవికిరణ్ బాధితులను కలిసి వాల్‌పోస్టర్లతో అవగాహన కల్పించారు. రాష్ట్ర కార్యదర్శి యశ్వంత్ అధ్యక్షతన శేరిలింగంపల్లి ఇన్చార్జి రాజు ఆధ్వర్యంలో బాధితులను కలిసి రేవంత్‌రెడ్డి వైఫల్యాలపై అవగాహన కల్పించారు. చైతన్యపురిలోని ఫణిగిరి కాలనీలో మూసీ బాధితులను రామన్ బృందం కలిసి మనోధైర్యం నింపింది.