ముషీరాబాద్/ కవాడిగూడ/ చిక్కడపల్లి, డిసెంబర్ 3: శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్‌లో తొలిరౌండ్ నుంచి గులాబీ పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయకేతనం ఎగురవేసింది సమీప ప్రత్యర్థి(కాంగ్రెస్) ఎం.అంజన్‌కుమార్ యాదవ్‌పై 37,797 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ముఠా గోపాల్‌కు 75,207 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్‌కు 37,410 ఓట్లు వచ్చాయి. దీంతో ముషీరాబాద్ నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు ఏ అభ్యర్థి సాధించనంత భారీ మెజార్టీని ముఠా గోపాల్ సొంతం చేసుకున్నారు.
మొత్తంగా 2014తో పోలిస్తే 2018లో 3.56 శాతం ఓటింగ్ తగ్గగా, 2018తో పోలిస్తే ప్రస్తుతం 0.80 శాతం ఓటింగ్ తగ్గింది. బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ 49 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి 24 శాతం, బీజేపీ 23.05 ఇతరు 3.5 శాతం ఓట్లు సాధించారు. ఓట్ల కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు బీఆర్ఎస్ అభ్యర్థి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఏ ఒక్క రౌండ్లో అటు కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్, ఇటు బీజేపీ అభ్యర్థి పూస రాజులు పోటీ ఇవ్వలేకపోయారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఆదివారం ముషీరాబాద్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. కవాడిగూడ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వై. శ్రీనివాస్‌రావు, సబీల్ అహ్మద్‌ల ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.