సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యంతో తెలంగాణలోని 40 లక్షల మంది మాలలకు ఎస్సీ వర్గీకరణ, జీవో నెంబర్ 99తో తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్లో రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. మాలలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలని వారు కేటీఆర్‌ను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జీవో నంబర్ 99 ద్వారా ఎస్సీలలోని 59 కులాల్లో 58 కులాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు. తక్షణమే సంబంధిత జీవోను సవరించి మాలలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదన్నారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు రాంచందర్, తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం నాయకులు కే బాలక్రిష్ణ, బేగరి దేవదాస్, తెలంగాణ మాల యూత్ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ వీ వీరస్వామి, జేఏసీ వర్కింగ్ చైర్మన్ మంత్రి నర్సింహయ్య, విద్యార్థి జేఏసీ అధ్యక్షులు మాదాసు రాహుల్ రావు, ఉస్మానియా యూనివర్సిటీ హంస అధ్యక్షులు నామ సైదులు, చీఫ్ కోఆర్డినేటర్ తాళ్లపల్లి రవి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.