సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) ః కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుతో నగరంలోని అన్ని విభాగాలు నిర్వీర్యమైయ్యాయని ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు కరువైనట్లుగా బీఆర్ఎస్ బస్తీ దవాఖానాల బాటలో తేలింది. నగరంలో 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తే… ఏ ఒక్క బస్తీ దవాఖానాల్లో కనీసం వైద్య సేవలు అందడం లేదనీ 110 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేయగా… ఇప్పుడు అత్యవసర మందులు కూడా లేవనీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు గుర్తించారు.
ఇక కాలం చెల్లించిన మందుల పంపిణీ, ఉచితంగా అందాల్సిన వైద్య పరీక్షలు కూడా పడకేసిందనీ తేల్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నగరంలో పలు డివిజన్ల పరిధిలో ఉన్న బస్తీ దవాఖానాలను బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పర్యటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలు మన్నె కవిత, మన్నె గోవర్ధన్‌తో కలిసి నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానను సందర్శించారు. కేటీఆర్ అక్కడి రోగులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
పేదలు, బస్తీ వాసులకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించాలనే లక్ష్యంతో 450 దవాఖానాలను మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. వీటి ద్వారా ఉచితంగా వైద్య సేవలు, మందుల పంపిణీ, వైద్య పరీక్షలతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేలా నగరం నలువైపులా నాలుగు టిమ్స్‌లను నిర్మాణం చేశారన్నారు. 108 రకాల మందులను అందుబాటులో ఉంచి అత్యవసర వైద్య సేవలను కూడా కల్పించిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. వైద్య సిబ్బందికి జీతాల పెంపు హామీతోపాటు, బస్తీ దవాఖానాలను బలోపేతం చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామనీ కేటీఆర్ స్పష్టం చేశారు.
బస్తీ దవాఖానాల్లో పనిచేసే సిబ్బంది, వైద్యులకు జీతాలు ఇవ్వకపోతే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఎలా అందుతాయని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ బస్తీ దవాఖానాల బాటలో భాగంగా నగరంలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానాను సందర్శించారు. బస్తీ దవాఖానాల్లో సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు రావడం లేదనీ, సపోర్టింగ్ స్టాఫ్‌ని అడిగిన కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేదొకటనీ, ఒకటో తారీఖుకు జీతాలు ఇస్తామని చెప్పుకుంటున్నా.. ఆరు నెలలు గడిచిన బస్తీ దవాఖానాల సిబ్బందికి జీతాలను ఎందుకు ఇవ్వడం లేదన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బస్తీ దవాఖానాల్లో మందులు లేకున్నా.. డాక్టర్లు రాకున్నా… వైద్య పరీక్షలు జరగకున్నా… తమ పార్టీ గెలిచిందనీ రేవంత్ రెడ్డి అనుకుంటాడు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు. ఆ నియోజకవర్గంలో ఉండే బంధుమిత్రులకు కాంగ్రెస్ వైఫల్యాల గురించి వివరాలన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ వినాయక్‌రావు నగర్‌లోని బస్తీ దవాఖానాలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పర్యటించారు. రెహ్మత్ నగర్ డివిజన్లోని ప్రతిభ నగర్ బస్తీ దవాఖానాను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడి సందర్శించారు. కనీస మందులు పంపిణీ చేయలేయని దౌర్భగ్యానికి బస్తీ దవాఖానాలు చేరుకున్నామని మండిపడ్డారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌తో కలిసి షేక్‌పేట్ డివిజన్లోని బస్తీ దవాఖాను సందర్శించారు. 1500 బస్తీలు ఉన్న నగరంలో పేదలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖాల ద్వారా వైద్యం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. వంద రకాల మందులకు మంగళం పాడిన రేవంత్ రెడ్డి బస్తీ దవాఖానాలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ)ః బస్తీ దవాఖానాల్లో కాలం చెల్లించిన మందుల పంపిణీపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేరింది. హైదరాబాద్‌లోని రసూల్‌పురా బస్తీ దవాఖానాలో కాలం చెల్లిన మందులను పంపిణీ చేస్తున్నారనీ, అత్యవసర గోళీలు లేవనీ, బస్తీ దవాఖానాల పరిస్థితి దారుణంగా ఉందనీ, అయినా ప్రజారోగ్య శాఖ పట్టించుకోవడం లేదంటూ జాతీయ మానవ హక్కుల సంఘాన్నీ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డా. రవీంద్ర నాయక్‌ను వెంటనే కాలం చెల్లిన మందుల సరఫరా నిలిపివేయాలని ఆదేశించాలనీ, అదేవిధంగా అత్యవసర వైద్య సంరక్షణలో ఉపయోగపడే మందులను అన్ని బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉంచాలని ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించింది.