ఢిల్లీ జంతర్ మంతర్‌ను తలపించేలా.. జెన్జీలు కదంతొక్కారు. శాంతియుతంగా పోరాడితే..రక్తం చూపిస్తారా.. మేల్కొన్నాం.. ఇకపై ఏ తప్పునూ సహించబోం.. అన్న నినాదాలతో ఇందిరాపార్కు దద్దరిల్లింది. విద్యార్థులపై కేంద్రం దమనకాండకు నిరసనగా నీట్ ప్రశ్నాపత్రం లీక్.. సీబీఎస్ఈ అవకతవకలతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్వీ శంఖారావం పూరించింది. ఇందులోభాగంగా శుక్రవారం ఇందిరాపార్కులో జెన్జీల మద్దతు సభ నిర్వహించింది.
వేలాదిగా తరలొచ్చిన జెన్జీలు.. .పేపర్ల లీకేజీతో తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వంపై గళమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు..ఛలోక్తులతో రూపొందించిన విభిన్న రకాల ప్లకార్డులతో ఆలోచన రేకెత్తించారు. సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవ్వడంతో జెన్‌జీలలో నూతనోత్తేజం నిండింది. తమ పోరాటానికి మద్దతుగా నిలిచినందుకు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్ స్ఫూర్తివంతమైన ప్రసంగం..అండగా ఉంటామని ఇచ్చిన అభయం..వారిలో మనోధైర్యాన్ని నింపింది.
– సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూలై 24 ( నమస్తే తెలంగాణ ) : : నీట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్ఈ అవకతవకలతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్వీ శంఖారావం పూరించింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండకు నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కులో జెన్జీల మద్దతు సభ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా జెన్జీలు వేలాదిగా తరలొచ్చారు.

బిహార్, ముంబై, బెంగళూరు తదితర రాష్ర్టాల నుంచి సైతం నీట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌ను తలపించేలా ఇందిరాపార్కు దారులన్నీ జెన్జీలు, బీఆర్ఎస్వీ విద్యార్థులతో నిండిపోయాయి. పేపర్ల లీకేజీతో తమ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వంపై గళమెత్తారు.
మోదీ డౌన్ డౌన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర గద్దె దిగిపో అంటూ హెచ్చరించారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవ్వడంతో జెన్జీలు నూతనోత్తేజంతో ఉరకలేశారు. మరోవైపు ఊహించని విధంగా సభకు భారీగా జనం తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చుట్టూ బారికేడ్లతో ఇందిరాపార్క్ ప్రాంగణమంతా అదుపులోకి తీసుకున్నారు. హస్తం పార్టీ విద్యార్థి సంఘాలు కొంత సభను ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన సందర్భంలో వారితో జెన్జీలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ విద్యార్థి నాయకులను అక్కడ్నుంచి తరలించారు.

బీఆర్ఎస్వీ పిలుపుతో జెన్జీలుకదం తొక్కారు. ఒక్కొక్కరూ విభిన్న రకాల ప్లకార్డులతో ఆలోచన రేకెత్తించే రైటింగ్స్‌తో ఆకట్టుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలు, ఛలోక్తులతో రూపొందించిన ప్లకారులతో చురకలు అంటించారు. జెన్‌జీలలో ఎవ్వరిని కదిలించినా ఒక్కటే మాట తాము మేల్కొన్నామని..ఇకపై ఏ తప్పును సహించబోమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హామీలు నెరవేర్చకపోతే ఓటుతోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

“జెన్‌జీ డోంట్ ఫికర్.. దిగిండు స్ట్రాంగ్ లీడర్” అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ప్లకార్డులను ప్రదర్శించారు. బీజేపీ అంటే బడా జూమ్లా పార్టీ, మేం విద్యార్థులం టెర్రరిస్టులం కాదు, స్టూడెంట్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఫర్ సేల్, ‘ఐ యామ్ టూ బిజీ బీయింగ్ ఏ దివ. ఐ కెన్ నాట్ హియర్ యూ’ ఏక్ కా బేటా టీ20 ఏక్ కా బేటా ఈ20 దోనో కా బేటా 420, ఏక్‌థా లీకర్, మేం మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు” తదితర నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. సభా ప్రాంగణమంతా ప్లకార్డుల ప్రదర్శనలోనే వారి డిమాండ్లను ఎత్తి చూపారు.

రీ నీట్ నిర్వహించాం కదా అని చెబితే కుదరదు. మొదట ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా చూసుకోవాలి. మళ్లీ ఎలక్షన్స్ పెట్టమంటే వీళ్లు పెడతారా? పరీక్షలంటే అంత చులకన ఎందుకు? అందుకే చదువుకుని సంస్కారం ఉన్నవాళ్లనే నాయకులుగా ఎన్నుకోవాలి. విద్యార్థులు ప్రశ్నిస్తే టెర్రరిస్టులని అంటున్నారు. అది చాలా బాధాకరం. ఈ దేశం మాది. మీరు టెర్రిస్టుల్లా వ్యవహరిస్తూ పేపర్లు లీక్ చేస్తున్నారు. మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు రాజీనామా చేయాలి.
– నందన్
నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కేటీఆర్ అల్టిమేటం జారీ చేశారు. తాత్సారం చేస్తే ‘రాజ్యమా ఉలిక్కిపడు. జెన్‌జీలకు పొట్టుపొట్టు ఆకలి ఉంది..మెట్టు మెట్టు ఎక్కి తొక్కుతర’ని తనదైన శైలిలో కేటీఆర్ ఇచ్చిన వార్నింగ్‌కు సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగింది.
మేమంతా సీజేపీ సైనికులం. పరీక్షల అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థులను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలి. మా జెన్‌జీలకు మద్దతు పలికిన కేటీఆర్‌కు థ్యాంక్స్. మా పోరాటానికి ఎటువంటి సాయమైనా అందిస్తామని చెప్పారు. విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న వారికి ఓటుతోనే బుద్ధి చెబుతాం.
-ఎం. మోసెస్ ప్రణయ్ రాజ్
గ్రామీణ, పేద వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు డాక్టర్ కావాలని కలలు కంటారు. కానీ నీట్ పేపర్‌ను లీక్ చేసి విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు. కేంద్రం మొండి వైఖరిని వీడి కేంద్రమంత్రి ధర్మేంద్రను పదవి నుంచి తప్పించాలి. ఢిల్లీ విద్యార్థుల పోరాటానికి మేం మద్దతుగా ఉన్నాం. అక్కడి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సీజేపీ సభ్యులను విచక్షణరహితంగా పోలీసులు కొడుతున్నారు. శాంతియుతంగా పోరాడితే రక్తం చూపిస్తారా? మేం మాత్రం హింసకు వ్యతిరేకం. కేటీఆర్ మాకు అండగా నిలవడం మాకు బలాన్నిచ్చింది.
-టీ. బ్రింద
వేలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి నీట్‌కు సన్నద్ధమవుతారు. డాక్టర్స్ కావాలని ఆశపడుతారు. పేపర్లు అమ్ముకోవడం సిగ్గుచేటు. అట్లాంటి వారిని శిక్షించాలి. న్యాయస్థానం వారిని శిక్షిస్తుందని నమ్ముతున్నాం. మా పోరాటానికి మద్దతు పలికిన బీఆర్ఎస్ పార్టీకి మేం థ్యాంక్స్ చెబుతున్నాం. మాకు మద్దతిచ్చే ప్రతీ సభకు హాజరవుతాం. మా ఫ్యూచర్‌ని నాశనం చేసే ప్రతీ రాజకీయ పార్టీకి ఓటుతోనే బుద్ధి చెబుతాం.
-అనన్య భూక్యా



