ఒకవైపు మూడు ఎకరాల పొలం.. మరోవైపు అంతర్జాతీయ వేదికపై దేశం కోసం పతకం సాధించాలనే కుమార్తె కల. ఆ కలను నిజం చేసేందుకు ఓ రైతు చేసిన పోరాటం ఇప్పుడు రెండు ఆసియా క్రీడల స్వర్ణ పతకాలుగా మారింది. పొలాన్ని నమ్ముకున్న తండ్రి.. విల్లును నమ్ముకున్న కుమార్తె.. కలిసి రాసిన ఈ విజయగాథ పేరు తానిపర్తి చికిత. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన 21 ఏండ్ల ఈ యువ ఆర్చర్ ఆసియాడ్‌లో 2 స్వర్ణ పతకాలతో భారత క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : చికిత ఆర్చరీ ప్రయాణం వెనుక ఆమె తండ్రి శ్రీనివాసరావు చేసిన త్యాగాలు ఎన్నో. తనకు క్రీడల్లో రాణించే అవకాశం రాలేదనే బాధతో.. తన పిల్లలు క్రీడల్లో ఎదగాలని చిన్నప్పటి నుంచే కోరుకునేవారు. చికిత తొలుత కరాటే నేర్చుకుంది. బ్లాక్‌బెల్ట్ కూడా సాధించింది. అయితే బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ విజయగాథ శ్రీనివాసరావును ప్రభావితం చేసింది. కుమార్తెను టీమ్ స్పోర్ట్‌లో కాకుండా వ్యక్తిగత ఆటలో తీర్చిదిద్దాలని భావించారు.
కరీంనగర్ పట్టణంలోని ఓ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఆర్చరీ శిక్షణ ఇస్తున్నాడని తెలుసుకొని చికితను అక్కడికి తీసుకెళ్లారు. దసరాకు బాబాయి గిప్టుగా బొమ్మ విల్లు (రికర్వ్ బౌ)తో మొదలైన చికిత సరదా ప్రయాణం.. క్రమంగా తీవ్రమైన శిక్షణగా మారింది. కానీ, అప్పుడే శ్రీనివాసరావుకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. చికిత ప్రాక్టీస్ కాంపౌండ్ విల్లు కావాలంటే దాదాపు రూ.3.5 లక్షలు అవసరమైంది. అంత డబ్బు ఆయన వద్ద లేదు. చుట్టాలు కూడా ఇక అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. చివరకు స్థానిక వడ్డీ వ్యాపారి వద్దకు పొలాన్ని తాకట్టుగా పెట్టి అప్పు తీసుకున్నారు.
హార్వెస్టర్ అమ్మి.. కూతురి కలకు బలం
చికిత శిక్షణ, పరికరాలు, ప్రయాణ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ కుటుంబంపై ఆర్థిక భారం కూడా పెరిగింది. చివరకు పొలం పనులు, వ్యాపారం కోసం 2018లో కొన్న హార్వెస్టర్‌ను బిడ్డ శిక్షణ కోసం ఏడాది తిరగకుండానే అమ్మేశారు. గ్రామీణ ప్రాంతంలో లభించే శిక్షణతో అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం కష్టమని గ్రహించారు. అప్పుడే భారత మాజీ కాంపౌండ్ ఆర్చర్ అభిషేక్ వర్మను సంప్రదించారు. ఫోన్ నంబర్ సంపాదించి శిక్షణ ఇవ్వాలని కోరారు. తొలుత ఎన్ని సార్లు ఫోన్ చేసినా అభిషేక్ పట్టించుకోలేదు.
కానీ, తండ్రికూతుళ్లు ప్రయత్నం ఆపకపోడంతో చివరకు చికితను ఢిల్లీకి తీసుకురమ్మని అభిషేక్ సూచించారు. ఆమె ప్రతిభను పరిశీలించిన అతను శిక్షణకు సహకరించారు. ఢిల్లీలోని యమునా స్పోరట్స్ కాంప్లెక్స్, పుణేలోని బాలేవాడీలలో రోజుల తరబడి హోటళ్లలో ఉంటూ, ఉపాసాలు ఉంటూ చికిత శిక్షణ పొందింది. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెలక్షన్స్‌లో ప్రతిభ చాటి సోనెపత్ జాతీయ శిక్షణా శిబిరానికి ఎంపికైంది. అమరావతిలో జరిగిన సబ్‌జూనియర్ నేషనల్స్‌లో తొలి పతకం సాధించిన చికిత, ఆ తర్వాత వెను తిరిగి చూడలేదు. ఆసియా గేమ్స్‌లో పతకం గెలిచి హార్వెస్టర్ కొనిస్తానని జపాన్ వెళ్లేముందు చికిత తండ్రికి చెప్పింది. మాటిచ్చినట్టుగానే ఏకంగా రెండు స్వర్ణాలు గెలిచిందామె.
కూతురు పోడియంపై.. తండ్రి పొలంలో..
చికిత నగోయాలో చరిత్ర సృష్టించిన క్షణాలను శ్రీనివాసరావు వీక్షించలేకపోయారు. ఎందుకంటే వాళ్ల ఇంట్లో టీవీ లేదు. తనకు స్మార్ట్‌ఫోన్ కూడా లేదు. సాధారణ నోకియా ఫోన్‌తోనే ఆయన ప్రపంచంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. చికిత పోటీని ఓ స్నేహితుడు చూసి ఫోన్ చేసి ఫలితాలు చెప్పాడు. ‘మొదటి స్వర్ణం గెలిచిందని ఫోన్ చేసి చెప్పారు. చాలా సంతోషించాను. కొద్దిసేపటికే మరో స్వర్ణం గెలిచిందని మళ్లీ ఫోన్ చేశారు. ఇంకా ఎక్కువ సంతోషం వేసింది. మ్యాచ్ చూడలేకపోయాను. పొలంలో పని ఉంది’ అని శ్రీనివాసరావు చెప్పడం ఆయన సాధారణ జీవన విధానానికి అద్దం పడుతుంది. చికిత తమ్ముడు యశ్వంత్ కూడా జాతీయ స్థాయి ఆర్చర్‌గా రాణిస్తున్నాడు. తల్లి శ్రీలత కుటుంబానికి అండగా నిలుస్తూ పిల్లల క్రీడా ప్రయాణానికి సహకరిస్తున్నారు.
పైసా ఇవ్వని ప్రభుత్వం
ఆసియా గేమ్స్‌లో చికిత రెండు స్వర్ణాలు నెగ్గడంతో చికితపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ విల్లు, బాణం పట్టి రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమెకు నయాపైసా సాయం అందలేదు. గత మూడేండ్లలో 7 పతకాలు గెలుచుకున్నా.. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తగిన ప్రోత్సహక నగదు బహుమతులు లభించలేదు. ప్రభుత్వం ఇతర క్రీడాకారులకు నగదు పురస్కారాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా.. తన కూతురును కనీసం పరిగణనలోకి తీసుకోలేదని శ్రీనివాసరావు వాపోయారు. కార్యాలయాల చుట్టూ తిరిగి గంటల తరబడి వేచి చూసినా సరైన స్పందన రాలేదని చెబుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఆయన కష్టానికి, చికిత ప్రతిభను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుందేమో చూడాలి.
ఆడ పిల్లకు ఆటలు ఎందుకన్నారు..
పేదరికం వల్ల నేను ఆటల్లోకి రాలేకపోయాను. నా బిడ్డను మాత్రం చాంపియన్‌గా మార్చాలని నిర్ణయించుకున్నా. అందుకోసం ఎన్ని కష్టాలు పడేందుకైనా సిద్ధమయ్యా. కానీ, ఈ ప్రయాణంలో మాకు చేయూతనిచ్చిన చేతుల కంటే ఎదురైన అడ్డంకులు, అవమానాలే ఎక్కువ. ఆడ పిల్లకు ఆటలేంటి అని మా చుట్టాలు, ఇరుగు పొరుగు నన్ను వెక్కిరించారు. ఆమె కోసం నేను అప్పులు చేస్తుంటే అవమానంగా చూశారు. హేళన చేశారు. కానీ, నా బిడ్డపై నాకు నమ్మకం ఉంది. ఆమె రోజుకైనా మా కుటుంబానికి, మన రాష్ర్టానికి పేరు తెస్తుందని తెలుసు. ఆ నమ్మకమే ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా నా బిడ్డను నడిపించి ఈ రోజు స్థాయిలో నిలబెట్టింది.
– ‘నమస్తే’ తో శ్రీనివాసరావు