సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ సమాజానికి అబద్ధపు హామీలు, ఆచరణ సాధ్యంకాని గ్యారంటీలు ఇచ్చి అధికార పీఠాన్ని దకించుకున్న కాంగ్రెస్ పార్టీ.. రెండేండ్ల పాలనలోనే అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజ మెత్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇన్చార్జి మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటుతున్నా..ఏ ఒక ప్రధాన ప్రాజెక్టు లేదా హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల హకులను, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. ‘నాడు పంపిణీ చేసిన మేనిఫెస్టోలు, గ్యారంటీ కార్డులు నేడు కేవలం అవుట్ స్టాండింగ్ డ్యూ కార్డులుగా (బాకీ కార్డులు) మిగిలిపోయాయి’ అని మండిపడ్డారు.వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అడ్డగోలు విమర్శలు, ఇతర డ్రామాలకు కాంగ్రెస్ తెరతీస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు.
కంటోన్మెంట్. మే 31. నా బూత్ చాలా మజ్బూత్ కార్యక్రమం పేరుతో బీఆర్ఎస్ కంటోన్మెంట్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కంటోన్మెంట్ నేతలు హాజరయ్యారు. దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్యనందిత చిత్రపటానికి కేటీఆర్, తలసాని, పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నోరున్నది కదాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే అధికారం ఉందని విర్రవీగితే సందర్భం వచ్చినపుడు కాంగ్రెస్ జెండానే కనిపించకుండా పోతుందని అన్నారు. అమలు కాని మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటుకు, తాగునీళ్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారని తెలిపారు. తులం బంగారం .మహాలక్ష్మి పథకం కింద రూ. 2500, రూ. 4వేల పింఛన్లు ఇవ్వలేదు, వికలాంగులకు ఆరువేల పింఛన్లు అని చాలా హామీలిచ్చారని అవి వస్తున్నాయా అని కార్యక్రమానికి హాజరైన వారిని అడిగారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ అంటున్నాడని కేసీఆర్ కట్టించిన సెక్రటేరియేట్ ఏమన్నా రేవంత్ అయ్యా జాగీరా అని ప్రశ్నించారు. కేసీఆర్ కట్టించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో మీటింగ్ పెడుతున్నాడు పెడుతున్నాడని, దేశ చిత్రపటంలో తెలంగాణను ఏర్పాటు చేసిన కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేసే దమ్ము రేవంత్‌కు లేదని అన్నారు. కంటోన్మెంట్లో కేసీఆర్ నాయకత్వంలో సాయన్న ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం ఇండ్లు. రామన్నకుంట చెరువు అభివృద్ధికి నిధులు, ఉచిత మంచినీటి సరఫరా, రసూల్‌పురా నాలా రిటైనింగ్ వాల్ ఇతర అభివృద్ధి పనులు చాలా జరిగాయని గుర్తు చేశారు. గులాబీ జెండా ఉంటేనే నాయకులు,కార్యకర్తలు ఉంటారని అందరు కలిసి కట్టుగా ఉండి ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

కంటోన్మెంట్: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వేదిక పైన ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం, తె లంగాణ తల్లి విగ్ర హం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే విధంగా వేదిక వద్ద దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సా యన్న, లాస్య నంది త చిత్రపటాలు ఏర్పాటు చేశారు. కేటీఆర్, తలసానితో సహా పలువురు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా సమావేశం వెలుపల బూత్‌స్థాయి కమిటీ సభ్యుల పేర్ల నమోదుతో వారికి బుక్లెట్స్ అందజేయడం జరిగింది. అదేవిధంగా 8 వార్డులతో పాటు మోండా డివిజన్లకు సంబంధించి నాలుగు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి బూత్ కమిటీ సభ్యులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. వేదిక మీద కేటీఆర్‌తో సహ నాయకులు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడారు.
గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో కంటోన్మెంట్ పరిధిలోని రహదారుల మూసివేతపై తాము కేంద్ర రక్షణ శాఖతో పోరాడిన తీరును, స్థానిక లీగల్, మిలిటరీ అథారిటీల ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన అంశాలను కేటీఆర్ గుర్తుచేశారు. కంటోన్మెంట్ ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమించిందని, కానీ నేటి కాంగ్రెస్ పాలనలో స్థానిక సమస్యలు, ప్రజా సంక్షేమం పూర్తిగా గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలోనే అత్యంత డైనమిక్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకుంటే.. ప్రస్తుత పాలకుల చేతకానితనం వల్ల అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉందని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కంటోన్మెంట్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రతి ఒకరూ సైనికుడిలా పనిచేయాలని, శ్రేణులకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ నేతలు నివేదిత సాయన్న, గజ్జెల నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతం 2వేల రూపాయల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఓటుకు 2వేలు పంచి గెలిచాడు. గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు పాశవికంగా ప్రవర్తించారు. కేటీఆర్ నాయకత్వంలో ఎస్ఐఆర్, డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమష్టిగా ఐకమత్యంతో విజయవంతం చేద్దాం.
– బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్