సిటీబ్యూరో, జూబ్లీహిల్స్, కవాడిగూడ, మే 11, (నమస్తే తెలంగాణ) : ఇచ్చిన హామీలను విస్మరించడంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలకు అంబాసిడర్లుగా నిలిచారని, దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని, బీఆర్ఎస్తోనే అది సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో.. అక్కడ మోదీ ఆటలు సాగలేదని, కానీ కాంగ్రెస్ ఉన్న చోట మోదీని ఎదుర్కొలేకపోయారన్నారు. బీజేపీకి బలమైన శక్తి ఎవరైనా ఉన్నారంటే..అది రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు.
పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కచ్చితంగా అది బీజేపీకి మేలు జరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాలను భయపెట్టి, డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నిస్తే బీజేపీ నాయకులను పట్టుకొని.. కేసులు నమోదు చేసి జైలుకు పంపామన్నారు. బీఆర్ఎస్ను భయపెట్టి, లొంగదీసుకోవడానికి మోదీ ప్రయత్నించారని, కానీ మేం తలవంచలేదన్నారు. తాము ప్రధాని మోదీకి లొంగనందుకే కవితపై అక్రమ కేసులు పెట్టి.. జైలుకు పంపారన్నారు.
‘పుట్టేది ఒక్కసారే..చనిపోయేది ఒక్కసారే..ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీకి తలవంచం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని యూసుఫ్‌గూడ మహమూద్ ఫంక్షన్ హాల్లో, ముషీరాబాద్‌లోని కశీశ్ ఫంక్షన్ హాల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో మోదీ 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని , అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలేనన్నారు. అదే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మాత్రం ఆ ప్రయత్నం చేసి విఫలమయ్యారని, తెలంగాణ, ఢిల్లీ , బెంగాల్ , తమిళనాడు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం బీజేపీ వాళ్ల కాలేదని కేటీఆర్ అన్నారు.
పదేండ్లలో మైనార్టీలు, పేదల సంక్షేమానికి నిజాయితీగా పనిచేసింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. రాజకీయాలు ఎప్పుడు చేయలేదని, పేదవాళ్లను పేదవాళ్లుగానే చూశారని వివరించారు. ఉత్తర ప్రదేశ్‌లో 4 కోట్ల ముస్లింలు ఉంటే.. రూ.1600 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టారని, బెంగాల్లో దాదాపు రెండు కోట్లకు పైగా ముస్లింలు ఉంటే.. అక్కడ 2వేల కోట్లు బడ్జెట్లో పెట్టారని కేటీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో కోటిన్నర ముస్లింలు ఉంటే.. రూ.670 కోట్లు, కర్ణాటకలో 80 లక్షల ముస్లింలు ఉంటే.. రూ. 2వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు.
అదే తెలంగాణలో మాత్రం 50 లక్షల ముస్లింలు ఉంటే.. 2వేల రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రంజాన్ వస్తే ముస్లింలకు, క్రిస్మస్ వస్తే క్రిస్టియన్లకు, బతుకమ్మ పండుగకు హిందువులకు కానుకలు ఇచ్చారన్నారు. కేసీఆర్ పాలనలో మత సామరస్యాన్ని కాపాడామని, ఒక్కసారి కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం రాలేదని, మతం పేరుతో కేసీఆర్ ఎప్పుడూ రాజకీయాలు చేయలేదన్నారు. దేశంలో అసలైన సెక్యులర్ నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. మైనార్టీల కోసం 204 స్కూళ్లు పెట్టామని, పేద విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీ పడాలని కేసీఆర్ భావించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రంజాన్‌కు తోఫా ఇవ్వలేదని, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మనిషి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నీ రోజులు బీజేపీని ఎదగనివ్వలేదని ఆ పార్టీ నాయకుడే చెప్పారని కేటీఆర్ వివరించారు. 2014, 2019లో దేశంలో బీజేపీ హవా ఉన్నప్పటికీ రాష్ట్రంలో మోదీని అడ్డుకున్నది కేసీఆర్ మాత్రమేనని, 2023లో కూడా బీజేపీ తీస్మార్ఖాన్లు అనుకునేటోళ్లను ఓడించింది కూడా బీఆర్ఎస్సే అని కేటీఆర్ అన్నారు. బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సోయం బాబూరావు వంటి వాళ్లను ఓడించింది బీఆర్ఎస్సే అని కేటీఆర్ గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నదని, కానీ కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్లో ఆ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిల్చొబెట్టి రాజాసింగ్‌ను గెలిపించారని కేటీఆర్ మండిపడ్డారు.
ఈ ఎన్నికల్లో కూడా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ అక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కొట్టుకోవడం కాదు.. ముందు బీఆర్ఎస్ను బొందా పెట్టాలని బండి సంజయ్ అన్నారని, ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్, బీజేపీ దోస్తానా ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ‘నిజంగా బీజేపీతోనే దోస్తానా ఉంటే..మా చెల్లెలు ఎమ్మెల్సీ కవిత 55 రోజులుగా జైల్లో ఉంటుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క కాంగ్రెస్ లీడర్ల కూతుళ్లు, కుమారులు జైళ్లో ఉన్నారా? అని అన్నారు. కేసీఆర్ కూతురు, హేమంత్ సోరేన్, కేజ్రీవాల్ వంటి వాళ్లు మాత్రమే బీజేపీని ఎదురించి జైళ్లలో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
పదేండ్ల కిందట మోదీ ఎన్నో హామీలు ఇచ్చారని, రూ. 15 లక్షల నగదు ఎవరి అకౌంట్లోనైనా పడ్డాయా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టిపు, ప్రతి ఒక్కరికీ ఇండ్ల్లు, ప్రతి ఇంటికీ నల్లా, బుల్లెట్ ట్రైన్ అని చాలా చెప్పించారని, ఏ ఒక్క హామీ అమలు చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. మోదీ హయాంలో పేదవాళ్ల పరిస్థితి ఆగమైందని, అన్ని ధరలు పెంచి పిరమైన ప్రధాని అయ్యారే తప్ప.. ఏం లేదన్నారు. ఈ సారి బీజేపోళ్లు 400 సీట్లు అంటున్నారని, ఒకవేళ మోదీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ రూ. 400లు అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేందర్.. ఆ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, అలాంటి వ్యక్తి రేపు బీజేపీకి వెళ్లడన్న గ్యారెంటీ ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. దానం నాగేందర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి సైతం బీజేపీతో కుమ్మకయ్యారని, ఎన్నికల తరువాత రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారని బీజేపీ నేతలే పేర్కొంటున్నారని కేటీఆర్ అన్నారు. బీజేపీ నాయకులు పేర్కొంటున్నట్లు దేశంలో హిందువులు ప్రమాదంలో లేరని, బీజేపీ వల్లే హిందుస్థాన్ ప్రమాదంలో ఉందన్నారు. ‘బడే భాయ్ మోదీ, చోటే భాయ్ రేవంత్‌రెడ్డిలు ఇద్దరూ ఒక్కటేనన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే వృథా అవుతుందన్నారు. బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో 10 నుంచి 12 ఎంపీ సీట్లు అప్పజెప్పితే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి పద్మారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీం, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్ ఇన్చార్జి ఎంఎన్ శ్రీనివాస్ , బీఆర్ఎస్ నాయకుడు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ పాల్గొన్నారు.