సిటీబ్యూరో/ మాదాపూర్ , మే 27, (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన అకాల వర్షానికి ఒక్కరోజే 14 మంది చనిపోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నష్ట పరిహారాన్నీ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. హఫీజ్‌పేట డివిజన్ సాయినగర్ యూత్కాలనీలో ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను సోమవారం కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి పరామర్శించారు.
అకాల వర్షానికి రషీద్, బాలుడు సమద్ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఘటన జరిగిన తీరును పరిశీలించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం భద్రత చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని, 60 వేల గృహాలను కేటాయించినట్లు చెప్పారు.
నిర్వాసితులైన కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను బాధిత కుటుంబాలకు కేటాయించి వారిని ఆదుకోవాలన్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. కేటీఆర్ వెంట డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, హఫీజ్‌పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, వాలా హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.