సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌ను జూబ్లీహిల్స్‌లో కొడితే ఆ శబ్దం రాష్ట్రమంతటా మోగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రెండేండ్లుగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, జూబ్లీహిల్స్‌లో ఓడిస్తేనే రేవంత్‌రెడ్డికి బుద్ధి వస్తుందని చెప్పారు. షేక్‌పేటలోని సత్వ, ఆదిత్య గేటెడ్ కమ్యూనిటీల నివాసితులతో ఆదివారం ఆయన సమావేశమై మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని జూబ్లీహిల్స్‌లో ఓడిస్తేనే రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి మాగంటి సునీతాగోపీనాథ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్క గంట సమయం కేటాయించి ఓటేయాలని కోరారు. ఓటేసి తర్వాత తమ తమ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్‌ల్లో పెట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ పాలనలో ప్రపంచ స్థాయికి హైదరాబాద్
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలబెట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. ‘వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్‌ను ఏర్పాటు చేశాం. దేశంలో తెలంగాణ జనాభా 2శాతం అయితే 5శాతం తలసరి ఆదాయాన్ని రాష్ట్రం నుంచి అందించాం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆరు లక్షల ఐటీ ఉద్యోగాలిచ్చాం. దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించింది. గ్రేటర్లో 70 కిలోమీటర్ల పరిధిలో 42 ఫ్లై ఓవర్లు నిర్మించాం. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు లాక్డౌన్ సమయంలో రాత్రిళ్లు రోడ్లు నిర్మించాం. దేశంలోని వివిధ ప్రాంతాల వలస కార్మికులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. వారికి ఇక్కడి వారితో సమానంగా భోజనం, వైద్య సదుపాయాలు కల్పించాం.
దేశంలోని అన్ని రాష్ర్టాల్లో వలస కార్మికులు వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్తుంటే.. తెలంగాణ నుంచి మాత్రం రవాణా సదుపాయాలు కల్పించి వారిని సొంతూళ్లకు పంపించాం. కేసీఆర్ పాలనకు ముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు కనిపించేవి. కానీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు కోతలు, నీటికి కటకట లేకుండా చేశాం. విద్యావంతులు ఓట్లేసి జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతాగోపీనాథ్ను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.