పార్టీ కష్టంలో ఉన్నా.. నేనున్నానంటూ.. ముందుకొచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలి. అవకాశవాది రంజిత్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో బారాబార్ ఓడించి చూపించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులదే.
KTR | వికారాబాద్, ఏప్రిల్ 3, (నమస్తే తెలంగాణ): బడుగు, బలహీనవర్గాల గొంతుక కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలీకార్ ఫంక్షన్ హాల్లో జరిగిన వికారాబాద్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ కష్టంలో ఉన్నా.. నేనున్నానంటూ.. నేను నిలబడుతానని ముందుకొచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలన్నారు. అవకాశవాది రంజిత్‌రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో బారాబార్ ఓడించి చూపించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులదేనని పిలుపునిచ్చారు. పట్నం మహేందర్ రెడ్డిని రెండుసార్లు మంత్రిని చేసింది కేసీఆర్ అని, రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రాంతం వారికి తెలియకున్నా.. నిలబెట్టి గెలిపించింది కేసీఆర్ అని గుర్తుచేశారు.
మరోవైపు నటనలో ఆస్కార్ ఇస్తే రంజిత్ రెడ్డికి, మహేందర్ రెడ్డికి ఇవ్వాలని కేటీఆర్ విమర్శించారు. పార్టీని వీడిన వారికి బుద్దొచ్చేలా కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పనిచేయడం లేదని, కొడంగల్ అభివృద్ధికి కోట్ల నిధులు కేటాయిస్తున్న రేవంత్ రెడ్డి వికారాబాద్, పరిగి, తాండూర్ నియోజకవర్గాలకు ఎందుకు నిధులివ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదిస్తే, పార్లమెంట్లో మీ గొంతుకనై ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.