బంజారాహిల్స్,ఆగస్టు 3: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం కారణంగా వస్తున్న ఉప ఎన్నికను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీరియస్‌గా తీసుకోవాలని, మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.
నిరంతరం ప్రజల్లో ఉంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్‌కు నిజమైన నివాళిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు ద్వారా అందించేందుకు కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట ఉన్న మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్లో చేరారని, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేశారని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా మాగంటి గోపీనాథ్ మాత్రం కేసీఆర్ వెంటనే ఉంటానంటూ అనేకసార్లు చెప్పేవారన్నారు. అలాంటి నిబద్ధత కలిగిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం కారణంగా రానున్న ఉప ఎన్నికను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలని, ఒక్కో బూత్‌లోని 100 మందికి ఒకరు చొప్పున ఇన్చార్జిగా ఉన్నారని, వారంతా తమ ప్రాంతంలోని ఓటర్లను కలిసి గతంలో బీఆర్ఎస్ పాలన, ఇప్పటి కాంగ్రెస్ పాలన గురించి చర్చించాలని సూచించారు.
గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారని, వారిని కలిసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కోరాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ఆటో డ్రైవర్లు, మహిళలు, వృద్ధులు, బస్తీలు, కాలనీల సంక్షేమ సంఘాల నేతలు, కుల సంఘాల పెద్దలను కలవాలని, వారంతా గతంలో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారని, ప్రస్తుతం ఉన్న అరాచక పాలనను చూస్తూ మరోసారి బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డా. దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ మంత్రి మహమూద్ అలీ, మాగంటి సునీతా గోపీనాథ్, కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దేదీప్యరావు, వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు షేక్ సొహైల్, రావుల శ్రీధర్‌రెడ్డి, దినేశ్ చౌదరి, అజమ్ అలీ పాల్గొన్నారు.