ఇసుకేస్తే రాలనంత జనం.. అడుగడుగునా అపూర్వ స్వాగతం.. ఎటుచూసినా గులాబీ జెండాల రెపరెపలు.. అందరి నోటా జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాల హోరు.. ఇలా సోమవారం రాత్రి కేటీఆర్ రోడ్‌షోకు బోరబండ జనం నీరాజనం పలికారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారానికి హాజరుకాగా, అశేష జనప్రవాహాన్ని చూసి ఉత్సాహంగా అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఇలా కిలోమీటర్‌కు పైగా డివిజన్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించగా దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేటీఆర్‌ను చూసిన సంతోషంతో ఇండ్లు, భవనాల పైనుంచి జనం అభివాదం చేస్తూ కేరింతలు కొట్టారు. బోరబండ, దర్గా, హైలెక్ చౌరస్తా వరకు రోడ్డు షో కొనసాగగా ఆద్యంతం ఈలలు, చప్పట్లు, జై జై నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మధ్యమధ్యలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చిత్రపటాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శిస్తూ తమ అభిమానం చాటుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలతో రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. రోడ్ షోకు వచ్చిన ప్రజలను చూసి.. జనమా? గులాబీ వనమా? అంటూ ఆశ్చర్యపోవడం కనిపించింది.
బీఆర్ఎస్కు బ్రహ్మరథం
సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గ్రేటర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వెల్లువలా తరలివస్తున్నారు. వేల సంఖ్యలో పాదయాత్రలు, బైక్ ర్యాలీలు చేస్తూ స్వచ్ఛందంగా సభాస్థలాలకు చేరుకొంటూ బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారు. ప్రియతమ నాయకుడిపై అభిమాన వర్షం కురిపిస్తుండడంతో రోడ్షోదారులన్నీ గులాబీ రంగు పులుముకుంటున్నాయి. కేటీఆర్ మార్క్ ప్రసంగానికి అపూర్వ స్పందన వస్తున్నది. పదేండ్ల బీఆర్ఎస్ సాధించిన ప్రగతి, రెండేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనపై పూసగుచ్చినట్టు వివరిస్తున్న తీరు ఆకట్టుకుంటున్నది. రేవంత్ సర్కారు వైఫల్యాన్ని ఎండగడుతూ.. గత కేసీఆర్ సర్కారు పనితీరును బేరీజు వేసేలా ‘కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అంటూ రామన్న అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఆయన ప్రసంగం ఆలోచనలో పడేసింది. విద్యావంతులంతా పోలింగ్ రోజు బయటకు వచ్చి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు.
హైడ్రా అనే రాక్షసి పోవాలంటే జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతా గోపినాథ్ గెలువాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ గెలుపు పక్కా అని తేలిపోయిందని, మెజార్జీ ఎంత అనేది తేలాల్సి ఉన్నదని చెప్పారు. పక్కనే ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లిలోకి హైడ్రా బుల్డోజర్లు వచ్చాయని రేపు జూబ్లీహిల్స్‌కు కూడా వస్తాయని.. వస్తే మేమున్నామని బుల్డోజర్లకు అడ్డం పడుతామని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ గుండాగిరీకి ఎవరికీ భయపడొద్దని అండా తామున్నాం అని అభయమిచ్చారు. బీఆర్ఎస్కు ఒక్క అవకాశం ఇవ్వండంటూ కేటీఆర్ ప్రజలను కోరారు. రేవంత్‌రెడ్డి కంటోన్మెంట్ ప్రజలు మభ్యపెట్టి గెలిచి 16 నెలలయ్యిందని, కానీ 16 పైసలు కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేయలేని రేవంత్.. జూబ్లీహిల్స్‌లో ఎలా చేస్తాడంటూ ప్రశ్నించారు. బోరబండలో కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సర్ధార్ కుటుంబానికి న్యాయం చేస్తామంటూ కేటీఆర్ భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోవాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలి : సర్ధార్ భార్య యాస్మిన్
‘కాంగ్రెస్ నాయకుల వేధింపులతోనే తన భర్త చనిపోయాడు. మా ఇంటిని కూల్చేశారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోవాలంటే మాగంటి సునీతా గోపినాథ్‌ను గెలిపించాలి’ అని సర్ధార్ భార్య యాస్మిన్ కోరారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు సర్ధార్ చిత్రపటంతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శించారు. బీఆర్ఎస్తోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగిపోయిందని అక్కడున్న ప్రజలు చర్చించుకుంటూ తామంతా బీఆర్ఎస్ వైపే ఉన్నామంటూ చాటి చెప్పారు.
బోరబండ ప్రజలకు శ్మశానవాటిక స్థలాన్ని ఇస్తానంటూ కాంగ్రెస్ మాయ చేసే కుట్ర చేసింది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని బోరబండ ప్రజలకు ప్రభుత్వం నుంచి కాకుండా సొంతంగానైనా శ్మశానవాటిక స్థలం ఇప్పిస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షధ్వానాలు చేశారు. రోడ్‌షోకు బోరబండ ఇన్చార్జి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు బాగా పనిచేశారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ గెలిస్తే రౌడీయిజం రాజ్యమేలుతుందని, బోరబండకు బుల్డోజర్లు దూసుకొస్తాయని కేటీఆర్ చెప్పిన మాటలకు స్థానిక ప్రజలు చప్పట్లతో ప్రతిస్పందించారు. కాంగ్రెస్ గెలిస్తే జుబ్లీహిల్స్‌లో ఆరాచకం ఉంటుందని అందరం జాగ్రత్తగా ఓటును వినియోగించుకోవాలంటూ బస్తీలు, కాలనీలోని ప్రజలు చర్చించుకున్నారు.
పార్టీ శ్రేణుల్లో జోష్
రోడ్ షోలకు వస్తున్న జన స్పందన చూసి గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నది. మరింత కష్టపడి పనిచేయాలనే పట్టుదల వారిలో కనిపిస్తున్నది. కాలనీ, బస్తీ, బస్తీల్లో కాంగ్రెస్, బీజేపీల వంచనను వివరించాలన్న ఉత్సాహం వారిలో నెలకొన్నది. రోడ్ షోలు సూపర్‌హిట్ అయ్యాయని, తమకు తమ యువనేత కొత్తజవసత్వాలు అందించారని, ఈ స్ఫూర్తితో ఉప ఎన్నిక అయిపోయేదాకా అవిశ్రాంతంగా పనిచేస్తామని జోష్‌తో ప్రకటిస్తుండడం విశేషం.
మరో ఎనిమిది చోట్ల రోడ్ షో
మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలు గత నెల 31న షేక్‌పేట డివిజన్‌తో శ్రీకారం చుట్టారు. 1న రహ్మత్‌నగర్, రెండవ తేదీన యూసుఫ్‌గూడలో వర్షం కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేశారు. తిరిగి 8న నిర్వహించేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం బోరబండ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. ఈ నెల 4న సోమాజిగూడ, 5న వెంగళ్రావునగర్, 6న ఎర్రగడ్డ, 8న షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్ డివిజన్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. చివరి రోజు 9న షేక్‌పేట నుంచి బోరబండ వరకు శ్రేణులతో కలిసి కేటీఆర్ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం ముగించనున్నారు.