కాంగ్రెస్ పార్టీకి చెందిన బోరబండ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ వేధింపులకు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ సర్దార్ బలయ్యారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో కక్షగట్టిన బాబా ఫసియుద్దీన్..ఇల్లు కూల్చేయించడంతో తీవ్రంగా మనస్తాపం చెందిన సర్దార్.. బలవన్మరణానికి పాల్పడ్డారు. మంచి మనిషిగా పేరు సంపాదించుకున్న ఆయన.. బాబా ఫసియుద్దీన్ దాదాగిరికి బలైపోయారని తెలుసుకున్న బోరబండ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.
వెంగళరావునగర్, మే 29 : పేదలందరికీ తలలో నాలుకలా మెలిగేవాడతను. పేదలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలబడి సాయమందించే మంచిమనిషిగా పేరుతెచ్చుకున్నాడు బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ సర్దార్ (34). కర్ణాటక ఉమ్నాబాద్‌కు చెందిన సర్దార్ కుటుంబంతో బోరబండ ఎస్ఆర్టీనగర్లో స్థిరపడ్డారు. ఇదే ప్రాంతంలో మెడికల్ షాపును నిర్వహించుకుంటూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.
వంద గజాల స్థలంలో జీ ప్లస్ వన్ ఇంటిలో నివాసం ఉండేవారు. సర్దార్ చేసే మంచిపనులకు భార్య సమీనా తోడై నిలిచేది. ఈ దంపతులకు మూడేండ్ల వయసున్న కుమారుడు సఫాన్, ఏడాదిన్నర కుమార్తె షిఫా ఉన్నారు. అతని తల్లిదండ్రులు, తమ్ముడు కూడా ఆ ఇంట్లోనే ఉండేవారు. వచ్చే నవంబర్ నెలలో సర్దార్ తమ్ముడు మహ్మద్ ఇబ్రహీంకు వివాహం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. తమ్ముడికి పళ్లుయితే ఇల్లు సరిపోదని భావించి.. మరో రెండతస్తులు నిర్మాణం చేపట్టాడు సర్దార్.
ఇంటి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తనకు డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. కష్టపడి సంపాదించి ..అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నానని ఇవ్వలేనని సర్దార్ చెప్పినా వినిపించుకోకుండా కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ భయభ్రాంతులకు గురిచేసేవాడు. డబ్బులు ఇవ్వలేదన్న కక్షగట్టిన కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్, అతని భార్య హబీబా సుల్తానా, అనుచరులతో కలిసి ఏకంగా బాధితుడు సర్దార్ ఇంటికే వచ్చి కుటుంబసభ్యులందర్నీ బెదిరించాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ హెచ్చరించాడు.
డబ్బు ఇవ్వకపోతే ఇల్లు కూలగొట్టిస్తా
‘ఇది నా ఇలాఖా.. నాకు మామూలు డబ్బు ఇవ్వకుండా ఇల్లు కట్టడానికి నీకెంత ధైర్యం.. నువ్వు ఇల్లు ఎలా కడ్తావ్. నీ అంతు చూస్తా.. నీ ఇంటిని పునాదులతో సహా కూల్చేయిస్తానం’టూ అధికార కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు సర్దార్‌ను బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో సర్దార్‌పై కార్పొరేటర్ కక్షగట్టి అన్నంత పనిచేశాడు. టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇంటిని కూల్చేయించాడు.
ఇంటి మూడో అంతస్తు స్లాబ్, గోడలకు పెద్ద రంధ్రాలతో డిమాలిషన్ చేయించాడు. మూడో అంతస్తే కాదు.. మొత్తం ఇంటిని పునాదులతో సహా కూల్చివేయిస్తానని.. మున్సిపల్ డిపార్ట్ మెంట్ అంతా తన చేతుల్లో ఉందని సర్దార్కు ఫోన్ చేసి బెదిరించాడు. ఇల్లు అంతా కూల్చితే భార్యాబిడ్డలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, తమ్ముడికి నిలువునీడ లేకుండా పోతుందని కలత చెందాడు సర్దార్. మనోవేదనతో ఉన్న సర్దార్ బుధవారం రాత్రి ఇంటి మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశాడు. దవాఖానకు తరలించగా.. అప్పటికే సర్దార్ మృతి చెందినట్లు నిర్థారించారు.
అనాథల్ని చేసి తిరిగిరాని లోకాలకు..
భార్యాబిడ్డల్ని అనాథల్ని చేసి సర్దార్ బలవన్మరణానికి పాల్పడి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు తోడుగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకునేవాడు.
జీ ప్లస్ టూ గా ఉన్న ఇంటిని మూడంతస్తులుగా నిర్మించి తమ్ముడికి పెళ్లి చేయాలని భావించాడు సర్దార్ మామూళ్ల కోసం బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు చివరికి సర్దార్ బలైపోయాడు. సర్దార్ ఆత్మహత్య ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. వారిలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. బోరబండ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. బల్దియా అధికారులు, వెంటనే కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం : డీసీపీ, విజయ్‌కుమార్
మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై బాబా ఫసీయుద్దీన్ అతని భార్య హబీబా సుల్తానా, పీఏ సప్తగిరిలపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నేపథ్యంలో వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, ఎస్ఆర్నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతుడు సర్దార్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని, అధైర్యపడొద్దని వారికి దైర్యం చెప్పారు. ఈ కేసులో ఎంతటివారినైనా అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
బాబా గూండాగిరికి సర్దార్ బలి
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ గూండాగిరి, అక్రమాలకు బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మాద్ సర్దార్ బలైపోవడం తనను ఎంతో బాధించిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం మహమ్మాద్ సర్దార్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
సర్దార్ మృతి ఆవేదన కలిగించింది
-మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి
సర్దార్ బలవన్మరణం తనకు తీరని ఆవేదనను మిగిల్చిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.